హీరో శ్రీకాంత్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఎవరు వద్దని చెప్పినా ఏ మాత్రం వినలేదు. విలన్ గా నటించొద్దని నెత్తినోరు బాదుకున్నా తన మాటే నెగ్గించుకున్నాడు. అనుకున్నట్టుగానే అఖండ మూవీలో విలనిజాన్ని ప్రదర్శించాడు. బాలయ్య గర్జనకు ధీటుగా గర్జించాడు. విలన్ అంటే ఇలానే ఉండాలి అనేలా తన నటనను ప్రదర్శించాడు.  

ఒకప్పుడు కథానాయకులుగా నటించిన వారు ప్రస్తుతం విలన్లుగా మారిపోతున్నారు. కొందరైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శుభలగ్నం, మావిడాకులు లాంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు జగపతి బాబు. చాలా సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించారు. కానీ జగపతి బాబులో ఇంత ఫైర్ ఉందా అని.. లెజెండ్ సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు. ఇంకేముందీ ఆ చిత్రం తర్వాత జగపతిబాబు ప్రతినాయకుడిగా చాలా బిజీ అయిపోయాడు. కేవలం తెలుగు సినిమాలే కాదు.. తమిళ చిత్రాల్లోనూ విలన్‌గా నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.   ఇప్పుడు హీరో శ్రీకాంత్ వంతు వచ్చింది. జగపతి బాబునే అనుసరిస్తున్నాడు శ్రీకాంత్. ఒకప్పుడు సాఫ్ట్ హీరోగా కనిపించిన శ్రీకాంత్ ఇప్పుడు రఫ్ గా కనిపిస్తున్నాడు. బాలయ్య సినిమా కోసం చాలా మారిపోయాడు.  

మొన్నటిమొన్న అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం చిత్రంలో శ్రీకాంత్ విలన్‌గా మెప్పించాడు.  ఆ చిత్రం ఆయనకు అనుకున్న రేంజ్ లో కలిసి రాలేదు. ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ చిత్రం శ్రీకాంత్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆయన నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. బాలయ్యకు ధీటుగా శ్రీకాంత్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించిన శ్రీకాంత్ ఇక ముందు విలన్ గా అలరించడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చారు ప్రేక్షకులు. మరి శ్రీకాంత్ కు ముందు ముందు ఎవరితో అవకాశాలు వస్తాయో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: