అఖండ... నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా. ఈ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. 53 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ చేసిన మూవీగా సినిమా నిలిచింది. దాదాపు 16 వందల స్ర్కీన్లపై ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను రిలీజ్ చేసింది. బెనిఫిట్ షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది అఖండ. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లలో అయితే అన్ని స్ర్కీన్లపైన ఇదే సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన అఖండ సినిమాకు బాలయ్య అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. అటు కరోనా ఆంక్షల తర్వాత చాలా రోజులకు థియేటర్లు కూడా ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాలయ్యను బోయపాటి మరోసారి స్క్రీన్‌పై కొత్తగా చూపించారని ప్రేక్షకులు కితాబిస్తున్నారు.

మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి బాలకృష్ణకు అఖండ ఆ లోటు భర్తీ చేసింది. గతంలో సింహా, లెజండ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఇప్పుడు అఖండతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. బాలయ్యకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకనే అఖండ సినిమాను అమెరికా, బ్రిటన్, దుబాయ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్ని చోట్ల కూడా బాలయ్య డైలాగ్, యాక్షన్‌కు ప్రేక్షకుల హంగామాతో మోత మోగుతున్నాయి. అయితే ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో మాత్రం ఈ సినిమా ప్రదర్శనకు బ్రేక్ పడింది. ఇందుకు ప్రధాన కారణం బాలయ్య అభిమానుల హంగామానే. బ్రిస్బేన్‌లోని ఓ స్క్రీన్‌లో షో స్టార్ట్ అయిన వెంటనే అభిమానులు రచ్చ చేశారు. ఇది తోటి ప్రేక్షకులకు కొంత ఇబ్బందిగా కూడా ఉంది. దీంతో వెంటనే థియేటర్ యాజమాన్యం... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా మరోసారి చేస్తే.. శిక్ష తప్పదని కూడా హెచ్చరించారు. ఆ తర్వాత సినిమా యథావిధిగా ప్రదర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: