2009లో సంచలనం సృష్టించిన పొలిటికల్ డ్రామా "మహాత్మ". శ్రీకాంత్ కెరీర్లోనే మరిచిపోలేని హిట్ ఇచ్చింది ఈ మూవీ. కృష్ణ వంశీ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జంటగా నటించిన శ్రీకాంత్, భావన మధ్య ప్రొమాంటిక్ కోణాన్ని చూపిస్తూనే, మరోవైపు హీరో పొలిటికల్ యాంగిల్ ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. విజయ్ ఆంటోని అందించిన సంగీతం అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించింది అనే చెప్పాలి. ఒక్కో పాటా ఒక్కో సెన్సేషన్. గాంధీని ప్రస్తావిస్తూ తీసిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలు కారణంగా 9 అక్టోబర్ 2009 న రిలీజ్ చేశారు. హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదలైన ఈ చిత్రం నాలుగు నంది అవార్డులు గెలిచింది.

దాసు (శ్రీకాంత్) హైదరాబాద్‌లోని ఒక బస్తీలో రౌడీ . చిన్న సమస్యల పరిష్కారం చేస్తూ జీవనం సాగిస్తాడు. కృష్ణవేణి (భావన) అనే యువ న్యాయవాదిని ప్రేమిస్తాడు. ఒక  చిన్న కేసులో ఆమె అతనికి బెయిల్ ఇప్పిస్తుంది. అక్కడి నుంచి పరిచయం పెరిగి కొన్ని సంఘటనల తర్వాత ప్రేమగా వారి స్నేహం మారుతుంది. మరోవైపు ఒక రాజకీయ కమ్ బిజినెస్ ఉమెన్ ( జ్యోతి ) ఆ బస్తీలో వాళ్ళను తరలించి డెవలప్మెంట్ ప్లాన్ తో కంపెనీ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది. దానిని అక్కడి నాయకుడు (శేఖర్) నేతృత్వంలోని నివాసితులు నిరసిస్తారు. ఇంతలో దాదా అనే స్థానిక రాజకీయ-రౌడీ నాయకుడు ( జయ ప్రకాష్ రెడ్డి) వ్యాపారవేత్తకు వ్యతిరేకంగా కూడా నిరసన తెలుపుతూ ఆమె అక్కడ ఏదైనా ఏర్పాటు చేయాలనుకుంటే రూ. 200 కోట్లు చెల్లించాలని చెప్తాడు. దాసు మొదట్లో దాదాను మంచి రాజకీయ నాయకుడిగా నమ్మి అతని కోసం పని చేస్తాడు. కానీ అతను మాత్రం దాసు నుండి ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తాడు. అసలు విషయం తెలుసుకున్న దాసు తన తప్పును తెలుసుకుని, కొత్తగా వస్తున్న మహాత్మా పార్టీలో పోటీ చేయాలని ప్లాన్ చేస్తాడు. కృష్ణవేణి, స్థానిక థియేటర్ ఆర్టిస్టులు దాసులో ఎలా మార్పు తీసుకొచ్చారు? మహాత్మాగాంధీ సిద్ధాంతం ప్రాముఖ్యతను ఎలా గ్రహించారు ? అనేది సినిమా యొక్క ప్రధాన అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: