ఇప్పుడు ప్రతి ఒక్కరూ సినిమా తీసేయడం, ఇతర భాషల్లోకి తామే డబ్బింగ్ చేయడం, నాలుగైదు సీన్లు రీషూట్ చేయడం,  అన్ని భాషలకు తెలిసిన నటీనటులని ముందుగానే ఫిక్స్ చేసుకోవడం.. చివరిగా  పాన్ ఇండియా మూవీ అనేయడం.. ఇదీ కథ. పాన్ ఇండియా మూవీ అనగానే సరిపోదు, దానికి తగ్గ లెక్కలు దానికి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ ఇండియా మూవీ తీయడం కంటే, దాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్లడమే పెద్ద తలనొప్పిగా మారింది. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కగా ఉండాలి, ఏ రాష్ట్రంలోనూ స్థానికంగా బలమైన సినిమా కాంపిటీషన్ పడకూడదు, ఆయా రాష్ట్ర ప్రజల మనోభావాలు ఎక్కడా దెబ్బతినకూడదు. ఇన్ని లెక్కలు వేసుకోవాలి.

ఆర్ఆర్ఆర్ చెప్పిన గుణపాఠంతో ఇకపై దర్శకుడు రాజమౌళి కూడా పాన్ ఇండియా అనరేమో అనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతి రేసులో ఉండాలనుకున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్.. కొవిడ్ ఆంక్షలకు భయపడి వెనక్కి పోయాయి. కాని భయం లేకుండా బంగార్రాజు, ఇతర సినిమాలు బరిలో దిగాయి, పండగ సీజన్ ని క్యాష్ చేసుకున్నాయి. సినిమా తీసుకుని జేబులో పెట్టుకోకూడదు, అయితే అటు, లేకపోతే ఇటు.. మధ్యలో మురగబెడితే మాత్రం బీపీలు, షుగర్ లు పెరగడం తప్ప ఇంకో ప్రయోజనం ఉండదు. ఇదీ ఈ సంక్రాంతి టాలీవుడ్ కి చెప్పిన నిజం.

పాన్ ఇండియా క్రేజ్ లో దర్శక నిర్మాతలంతా భారీ బడ్జెట్ సినిమాలు తలకెత్తుకున్నారు. సహజంగానే ఇలాంటి సినిమాలకు షూటింగ్ టైమ్ ఎక్కువ. తీరా సినిమా తీశాక, రిలీజ్ కోసం మంచి టైమ్ సెట్ చేసుకోవాలి. అసలే కరోనా కాలంలో అన్ని సినిమాలు వాయిదా పడుతుండటంతో.. ఏది ముందు ఏది తర్వాత, ఎంత గ్యాప్ లో రిలీజ్ చేయాలి అనేది తేలడంలేదు. ఆర్ఆర్ఆర్ లో గెటప్ రివీల్ చేస్తే, ఆ తర్వాత ఆచార్య రావాలి అనేది ఒప్పందం. కానీ అసలు ఆర్ఆర్ఆర్ కే టైమ్ దొరక్కపోతే, ఇక ఆచార్య సంగతేంటి. మరోవైపు చిరంజీవి మిగతా సినిమాలు కూడా జోరందుకున్నాయి. ఈ దశలో అసలు సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎన్నాళ్లు వేచి చూడాలి. పాన్ ఇండియా అనే ఇమేజ్ లో ఇరుక్కోకుండా బంగార్రాజు ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ అంటూ థియేటర్లలోకి వచ్చాడు. కొవిడ్ ఆంక్షలు ఉన్నా, ఏపీలో టికెట్ రేట్లు తక్కువ అనుకుంటున్నా కూడా గల్లా పెట్టె నింపుకుంటున్నాడు. ఇదే బాటలో మిగతా రెండు సినిమాలు కూడ మంచి కలెక్షన్లు కళ్లజూస్తున్నాయి. పండగ పూట థియేటర్లోకి వస్తే టాక్ ఎలా ఉన్నా కూడా సినిమాకి ఆర్థిక కష్టాలు ఉండవు. అదే ఫార్ములాని ఈ ఏడాది సంక్రాంతి సినిమాలన్నీ ఫాలో అయ్యాయి, సేఫ్ జోన్ లోకి వెళ్లాయి. కానీ పాన్ ఇండియా అనే బ్రాండ్ ఉండటం వల్ల ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మంచి సీజన్ ని మిస్ అయ్యాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఇకపై రాజమౌళి కూడా పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి చూపించరంటున్నారు సినీ విమర్శకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: