మంజూ వారియర్ మలయాళ చలన చిత్ర పరిశ్రమలో పేరున్న అగ్రకథానాయికి  మరియు ప్రముఖ నర్తకి , తమిళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అసురన్ లో ధనుష్ కు జోడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేవలం పెద్ద హీరోల సరసన హీరోయిన్గానే కాకుండా కథ బలం ఉన్న చిత్రాల్లో చిన్న పాత్రలు సైతం పోషించడానికి వెనుకాడరు . అందుకు ఉదాహరణలుగా అనేక చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలే నిదర్శనం. 

మంజూ వారియర్ స్వస్థలం కేరళ రాష్ట్రం అయినా తండ్రి ఉద్యోగ రీత్యా తమిళనాడు లోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ పట్టణంలో స్థిరపడ్డారు. ఆమె కూడా అక్కడే జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం అక్కడే పూర్తి చేసిన తర్వాత తండ్రి బదిలీ తో కేరళలోని కన్నూర్ లో వారి కుటుంబం స్థిరపడింది. ఇంటర్ మరియు డిగ్రీ లను కన్నూర్ లోనే పూర్తి చేశారు. 

నాట్యం లో మంచి ప్రావీణ్యం సాధించిన మంజూ చిన్నతనం నుంచే స్కూల్లో, కేరళ రాష్ట్ర స్థాయి షోస్ లో పలు నాట్య ప్రదర్శన లు ఇస్తూ వచ్చారు. నాట్యం లో ఆమె ప్రదర్శించిన అభినయాన్ని చూసిన వారు మలయాళ దూరదర్శన్ టివి కోసం నిర్మిస్తున్న సీరియల్ లో అవకాశం కల్పించారు. అలా బాలనటిగా తొలిసారిగా టివి సీరియల్ ద్వారా తెరపైకి వచ్చారు. 

17 ఏళ్ల వయస్సు లో సురేశ్ గోపి నటించిన సాక్ష్యం చిత్రం ద్వారా మలయాళ చలన చిత్ర పరిశ్రమలో కి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రవేశించి అతి కొద్ది కాలంలోనే అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికిగా ఏదిగారు. 1999లో సురేశ్ గోపి తో నటించిన పత్రం చిత్రం ఆమె మొదటి ఇన్నింగ్స్ లో ఆఖరి చిత్రం. 

మంజూ మాజీ భర్త మలయాళ కథానాయకుడు దిలీప్ , వీరిద్దరూ కలిసి నటించిన సల్లపమ్ చిత్రం  సమయంలో ప్రేమలో పడి వెను వెంటనే వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మంజూ సినిమాలకు దూరంగా ఉంటూ రాగా, ఈ సమయంలోనే దిలీప్ వరుస విజయాలతో మోహన్ లాల్ , మమ్ముట్టి , సురేశ్ గోపి తర్వాత అగ్రకథానాయకుడిగా ఏదిగారు. వీరి సంతానం మీనాక్షి. 

అనోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో మనస్పర్థలు రావడంతో 2014లో విడిపోయి తమ అభిమానులను షాక్ కు గురి చేశారు. విడాకులు తీసుకున్న తర్వాత దిలీప్ మళ్ళీ నటి కావ్య మాధవన్ ను వివాహం చేసుకోగా మంజూ మాత్రం ఒంటరిగా ఉంటూ వస్తున్నారు. 

విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో కి ప్రవేశించి న మంజూ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 2014లో సల్లపమ్ పేరుతో తన ఆత్మకథ ను విడుదల చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: