భారీ సినిమాలు తెర‌కెక్కించ‌డం గొప్ప విష‌యమే. అవి బాక్సాఫీసు వ‌ద్ద విజ‌య‌వంత‌మైతే కురిపించే కాసుల వ‌ర్షం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే వాటికి అన్నీ క‌లిసివ‌స్తేనే అంద‌రి క‌ష్ట‌మూ ఫ‌లించేది.. నిర్మాత, బ‌య్య‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు అంద‌రి మొహాల్లోనూ న‌వ్వులు విరిసేది. ద‌ర్శ‌కుడికి మ‌ళ్లీ అవ‌కాశాలు ద‌క్కేది. లేకుంటే అంద‌రూ మ‌నుగ‌డ కోసం టెన్ష‌న్ ప‌డ‌క త‌ప్ప‌ద‌నేది సినీ ప‌రిశ్ర‌మలో ప్రాథ‌మిక సూత్రం. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీసిని నిర్మాత కూడా ఒక భారీ చిత్రం డిజాస్ట‌ర్ అయితే తిరిగి కోలుకోవ‌డం క‌ష్ట‌మే. ఇందుకు చాలా ఉదంతాలే క‌నిపిస్తాయి. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చూస్తే తెలుగు, హిందీ భాష‌ల్లో ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాలు తీసిన సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు చెందిన ప‌ద్మాల‌యా బ్యాన‌ర్ పై తెర‌కెక్కిన సింహాసనం మూవీ హిందీ రీమేక్ ఫ్లాప్ కావ‌డంతో ఆ బ్యాన‌ర్ కోలుకోవ‌డానికి చాలాకాల‌మే ప‌ట్టింది. ఎందుకంటే ఆ చిత్ర నిర్మాణానికి అయిన భారీ వ్య‌య‌మే అందుకు కార‌ణం.
 

ఇక కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్ష‌కులూ మెచ్చిన జెంటిల్ మేన్‌, ప్రేమికుడు వంటి చిత్రాలు తీసిన కేటీ కుంజుమోన్ గుర్తున్నాడా..?  భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ప్రొడ్యూస‌ర్ ఆయ‌న‌. అంత‌కుముందు కూడా త‌మిళం, మ‌ల‌యాళంలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీసిన ఘ‌న‌త ఆయ‌న‌కు ఉంది. మ‌రి ఈ నిర్మాత అప్ప‌ట్లోనే ఓ పాన్ ఇండియా మూవీ స్థాయిలో హ‌డావిడి చేసి భారీ బ‌డ్జెట్‌తో నాగార్జున హీరోగా నిర్మించిన ర‌క్ష‌కుడు చిత్రం ఫ‌లితం ఇచ్చిన షాక్ నుంచి ఇప్ప‌టికీ కోలుకోలేద‌నే చెప్పాలి. అంతేకాదు.. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై మూడు త‌రాల హీరోల‌తో చిత్రాలు నిర్మించి ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌నందుకున్న సి. అశ్వ‌నీద‌త్ కూడా బాల‌కృష్ణ, శోభ‌న్‌బాబు హీరోలుగా రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో అప్పుడెప్పుడో నిర్మించిన అశ్వ‌మేథం, ఆ త‌రువాత ఇటీవ‌లికాలంలో తార‌క్ హీరోగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన శ‌క్తి చిత్రాల డిజాస్ట‌ర్ ఫ‌లితాల‌నుంచి కోలుకోవ‌డానికి చాలానే శ్ర‌మించాల్సి వ‌చ్చిందంటే న‌మ్మ‌క త‌ప్ప‌ని నిజం. అంతెందుకు బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ చిత్ర నిర్మాణ సంస్థ ఏబీసీఎల్ ఒక ద‌శ‌లో తీవ్ర‌మైన అప్పుల్లో కూరుకుపోవ‌డానికి సైతం ఇలాంటి సినిమాలే కార‌ణం. అందుకే మ‌రి సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ అయిన నిర్మాతలు వేళ్లమీద లెక్కించ‌ద‌గిన సంఖ్య ఎప్పుడూ దాట‌రు.

మరింత సమాచారం తెలుసుకోండి: