ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీలంటూ దేశ‌వ్యాప్త మార్కెట్ కోసం అన్నిభాష‌ల హీరోలు పోటీ ప‌డుతున్నారుగానీ కొంత‌కాలం క్రితం వ‌ర‌కు ఒక భాష‌లో విజ‌య‌వంత‌మైన సినిమాను ఇత‌ర భాష‌ల్లో రీమేక్ చేయ‌డ‌మే అధికం. ఆ హీరోలకు ఇత‌ర ప్రాంతాల్ల‌నూ గుర్తింపు ఉంటే డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేసేవారు. ఎందుకంటే డ‌బ్బింగ్ రైట్స్ తీసుకుంటే త‌క్కువ ఖ‌ర్చుతోనే డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌వ‌చ్చు. కొన్ని సినిమాలు రీమేక్ అయ్యాక కూడా మాతృక‌ల‌ను ఆయా భాష‌ల్లోకి డ‌బ్ చేసి విడుద‌ల చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. టీవీ మాధ్య‌మం ప్రాధాన్యం పెర‌గ‌డంతో శాటిలైట్ రైట్స్ ద్వారా వ‌చ్చే ఆదాయం కూడా ఇందుకు కార‌ణం. అయితే ఓ సినిమా రీమేక్ షూటింగ్‌లో ఉండ‌గానే ఆ సినిమా డ‌బ్బింగ్ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైతే  అది భారీ ఖ‌ర్చుతో పున‌ర్నిర్మాణానికి పూనుకున్న నిర్మాత‌ల‌కు చాలా ఇబ్బందిక‌ర‌మే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన అల‌వైకుంఠ‌పురంలో హిందీ రీమేక్ షెహ‌జాద్ అలాంటి  ఇబ్బందినే ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చిందిప్పుడు.
 
 కార్తీక్ ఆర్య క‌థానాయ‌కుడిగా అత‌డి స‌ర‌స‌న కృతిస‌న‌న్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో షెహజాద్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. దీనిని రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్‌కుమార్‌, ఆమ‌న్‌గిల్ నిర్మిస్తుండ‌గా అల్లు అర‌వింద్ నిర్మాణ భాగ‌స్వామిగా ఉన్నారు. తాజాగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టించిన పుష్ప చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో అత‌డికి బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు వ‌చ్చింది. దీంతో అల‌వైకుంఠ‌పురం చిత్రం డ‌బ్బింగ్ రైట్స్ చేతిలో ఉన్న బాలీవుడ్ నిర్మాత మ‌నీష్ షా స‌హ‌జంగానే అల్లు అర్జున్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆ చిత్రాన్నిహిందీలో డ‌బ్ చేసి థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీంతో షెహ‌జాద్ చిత్ర బృందం షాక్ తింది. త‌మ చిత్రం ఇంకా షూటింగ్‌లో ఉండ‌గానే దాని డబ్బింగ్ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో వ‌స్తే త‌మ సినిమా ప‌రిస్థితి ఏమిటంటూ మ‌నీష్ షాకు త‌మ అసంతృప్తిని తెలియ‌జేసింది. పోనీ ప్రాజెక్టును విర‌మించుకుందామంటే ఇప్ప‌టికే దాదాపు 40 కోట్ల‌కు పైగా షెహ‌జాద్‌పై వెచ్చించిన‌ట్టు తెలుస్తోంది. ఇటు మ‌నీష్ షా కూడా తాను డబ్బింగ్ వెర్ష‌న్ సిద్ధం చేసుకున్నాన‌ని ఇప్పుడు వెన‌క్కు త‌గ్గితే త‌న‌కు రూ. 20 కోట్లు న‌ష్ట‌మ‌ని చెపుతుండ‌టంతో వివాదం పెరిగింది. మ‌నీష్ షా ఇప్ప‌టికే ప‌లు ద‌క్షిణాది సినిమాల‌ను హిందీలో అందించ‌డం ద్వారా ఇక్క‌డి నిర్మాత‌ల‌తో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు సంప్ర‌దింపులు ఫ‌లించి మ‌నీషా షా త‌న డ‌బ్బింగ్ వెర్ష‌న్ విడుద‌ల‌ను వాయిదా వేసుకున్న‌ట్టు తెల‌ప‌డంతో ఈ గొడ‌వ సుఖాంత‌మైంది. అయితే ఆయ‌న థియేట‌ర్లో విడుద‌ల ప్ర‌స్తుతానికి విర‌మించుకున్నా దానిని త‌న‌ చాన‌ల్ ద్వారా విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: