‘అఖండ’ సినిమా చివరిలో అఘోర పాత్ర చేసిన బాలయ్యతో ఆమూవీలో కీలక పాత్రను చేసిన పాపకు ఒక మాట ఇప్పిస్తాడు. ఆ అమ్మాయికి ఎప్పుడు అవసరం అయినా పిలిస్తే చాలు ఆమె దగ్గరకు వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. దీనితో ‘అఖండ’ మూవీకి సీక్వెల్ ఉంటుంది అన్న సంకేతాలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయం నిజం కాబోతోంది అని వార్తలు వస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరంలోపు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అన్న సంకేతాలు వస్తూ ఉండటంతో సరిగ్గా ఎన్నికల సమయానికి ముందు అప్పటి రాజకీయ పరిస్థితులను బాలయ్య ‘అఖండ’ పాత్ర ద్వారా టార్గెట్ చేస్తూ ఒక పవర్ ఫుల్ కథను తయారు చేయమని బాలయ్య బోయపాటికి ఈమధ్య చెప్పాడట. ఈ సూచన బోయపాటికి బాగా నచ్చడంతో ‘అఖండ’ సీక్వెల్ కు రంగం సిద్ధం అవ్వడంతో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బోయపాటి టీమ్ బిజీగా ఉన్నట్లు టాక్.


ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని మూవీని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈమూవీ పూర్తి అయిన వెంటనే బాలయ్య ఆగష్టు నుండి అనీల్ రావిపూడి మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆమూవీని వేగంగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం ప్రారంభం నుండి ‘అఖండ’ సీక్వెల్ షూటింగ్ ప్రారంభించి వచ్చే సంవత్సరం చివరకు రాబోయే ఎన్నికల సమయానికి ఈమూవీని రెడీ పెట్టాలని బాలయ్య బోయపాటిల ఆలోచన అంటున్నారు.


ప్రస్తుతం బోయపాటి రామ్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ చేస్తూనే బాలకృష్ణతో తీయబోయే ‘అఖండ’ సీక్వెల్ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతాడట. 2014 ఎన్నికల సమయంలో బాలయ్య బోయపాటిల ‘లెజెండ్’ వచ్చి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో జరగబోయే ఎన్నికల సమయంలో విడుదలకాబోయే ఈ ‘అఖండ’ సీక్వెల్ ఎలాంటి ఘనవిజయం సాధిస్తుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: