నందమూరి బాలకృష్ణ కు అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా అవధులు ఉండవు అన్నవిషయం అనేక సందర్భాలలో రుజువైంది. బాలయ్యకు కోపం వస్తే తన అభిమానిని కూడ చెంప వాయిస్తాడు. అదేవిధంగా అతడి అభిమాని ఇంటికి వెళ్ళి అతడు పెట్టే చాపల పులుసు తింటాడు. అలాంటి బాలయ్యకు ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న షూటింగ్ ల బంద్ పై విపరీతమైన ఆగ్రహం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.


ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పిలుపు మేరకు ప్రస్తుతం షూటింగ్ ల బంద్ కొనసాగుతోంది. దిల్ రాజ్ కీలకంగా వ్యవహరిస్తున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ షూటింగ్ ల బంద్ కు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈవిషయమై బాలయ్యకు విపరీతమైన అసహనాన్ని కలిగిస్తోంది అంటున్నారు.


ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎవరికీ వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇండస్ట్రీ బాగా నష్టపోతోందని బాలయ్య భావిస్తున్నట్లు టాక్. అంతేకాదు తాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీమూవీస్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఈ బంద్ వల్ల ఆగిపోవడం బాలయ్యకు ఏమాత్రం రుచించడం లేదు అని అంటున్నారు. దీనితో బాలయ్య మైత్రీమూవీస్ నిర్మాతలకు ఫోన్ చేసి వెంటనే షూటింగ్ మొదలుపెట్టమని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.


అంతేకాదు మైత్రీ మూవీస్ నిర్మాతలు ఈవిషయమై స్పందించకపోతే తాను వేరే సినిమా షూటింగ్ కు వెళ్ళిపోతానని చెపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని కూడ తన ‘దసరా’ మూవీ విషయమై ఇలాంటి ఒత్తిడి తన నిర్మాతల పై చేస్తున్నట్లు టాక్. ఇప్పుడు ఈ లిస్టులో మహేష్ కూడ చేరిపోయి త్రివిక్రమ్ తో మొదలుపెట్టవలసిన మూవీని షూటింగ్ ల బంద్ తో నిమిత్తం లేకుండా ఆగష్టు 15 నుండి మొదలుపెట్టమని ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉండటంతో షూటింగ్ ల బంద్ విషయంలో ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందా అన్నసందేహాలు కొందరిలో ఉన్నాయి. దీనితో ఈసమస్యలకు ఎలాంటి పరిష్కారం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇస్తుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి: