డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకప్పుడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్ని అందించాడు. 'పోకిరి'లాంటి ట్రెండ్‌సెట్టింగ్ సినిమాతో..
ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చేశాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. 'లైగర్' మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ, అది కూడా ఘోరంగా బెడిసికొట్టింది. నిజానికి.. ఓ సినిమా తీసేందుకు పూరీ ఆరు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకోడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. కానీ, లైగర్ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలన్న ఉద్దేశంతో, 'లైగర్' మీదే దృష్టి సారించాడు. కానీ, అతని కష్టమంతా బూడిదపాలైంది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. పూరీకి విమర్శలే మిగిలాయి.

అయినప్పటికీ పూరీ జగన్నాథ్ నిరాశ చెందకుండా.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్‌పై పని చేయడం మొదలుపెట్టేశాడు. 'లైగర్' డిజాస్టర్ అవ్వడంతో.. విజయ్ దేవరకొండతోనే చేయాలనుకున్న 'జన గణ మన' సినిమా ఆగిపోయింది కాబట్టి, మరో కొత్త స్టోరీని డెవలప్ చేయడంలో బిజీ అయిపోయాడు. స్క్రిప్ట్ సిద్ధం చేయడం కోసం ఆల్రెడీ పూరీ గోవాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే.. పూరీ తన తదుపరి సినిమా కొడుకు ఆకాశ్ పూరీతో చేయనున్నాడని టాక్ వినిపించింది. ఫ్లాపుల్లో ఉన్న పూరీ ఏ ఇతర హీరోలు డేట్స్ ఇవ్వడం లేదని, అందుకే తన కొడుకుతో సినిమా చేయాలని పూరీ నిర్ణయించుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజా సమాచారం. పూరీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆకాశ్‌తో చేయడం లేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. పూరీ తన ప్రాజెక్ట్ కూడా గ్రాండ్‌గానే ప్లాన్ చేస్తున్నాడని, అయితే హీరో ఎవరన్నది ఇంకా కన్ఫమ్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ పనుల్లోనే పూర్తిగా నిమగ్నమయ్యాడని, అది పూర్తయ్యాకే హీరో గురించి ఆలోచించే అవకాశం ఉందని తెలిసింది. తన స్ర్కిప్టులపై విమర్శలు వస్తోన్న తరుణంలో.. వాటికి చెక్ పెట్టేలా ఒక మంచి స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో పూరీ ఉన్నాడని చెప్తున్నారు. మరి, ఈసారి పూరీ ఎలాంటి స్క్రిప్టుతో, ఏ హీరోతో రానున్నాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: