తెలుగు సినిమా గురించి ఇపుడు మనం మాట్లాడుకోవలసిన పనిలేదు. ప్రపంచమే నేడు మన టాలీవుడ్ పరిశ్రమ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటుంది. దానికి కారణం అందరికీ తెలిసినదే. దాదాపు ఓ దశాబ్ద కాలంగా మన తెలుగు సినిమాలు గ్లోబల్ స్థాయిలో సత్తా చాటున్నాయి. దర్శకధీరుడు ఎప్పుడైతే బాహుబలిని ప్రపంచానికి పరిచయం చేసాడో ఇక అప్పటినుండి తెలుగు సినిమా జెండా ఈ భూతలంపైన రెపరెపలాడడం మొదలు పెట్టింది. దాంతో ప్రపంచ సినిమా మనవైపు రెప్పార్పకుండా చూస్తోంది.

ఈ క్రమంలో ఎంతోమంది ఎన్నోరకాలుగా తెలుగు సినిమాని కొనియాడుతున్నారు. తాజాగా 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ కూడా తెలుగు సినిమాలపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ 'నింద' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజేష్ జగన్నాథం దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ థ్రిల్లర్.. జూన్ 21న థియేటర్లలో విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా హీరో వరుణ్ సందేశ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

17 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చూశానని, అయితే అన్ని సందర్భాల్లోనూ తమ ఫ్యామిలీ తనకు ఎంతగానో సపోర్ట్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికి తన సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురు చూసే ఆడియెన్స్ ఉన్నందుకు చాలా అదృష్టవంతుడినని అన్నారు. వారికోసమే 'నింద' మూవీ చేసానని, అందరికీ కచ్ఛితంగా నచ్చుతుందని నమ్ముతున్నానని చెప్పారు. సినిమా కంటెంట్ నచ్చితే తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. అదేవిధంగా సినిమా అనేది తెలుగువారి రక్తంలోనే ఉందని, ఏ సినిమానైనా రెచ్చిపోయి చూస్తారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇకపోతే నింద సినిమా అనేది జనాలకు ఖచ్చితంగా నచ్చుతుందనే ధీమాతో ఉన్నట్టు వరుణ్ తన ధీమాని వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: