దళపతి విజయ్ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆయన నటించిన ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) విడుదలై, ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ది గోట్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టుతోంది అని సర్వేలు చెబుతున్నాయి. కాగా దీని తర్వాత దళపతి విజయ్ ఇదే తన చివరి సినిమా అంటూ అనౌన్స్ చేశాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. విషయం ఏమిటంటే... ఈ సినిమా తరువాత వచ్చే సంవత్సరం పూర్తి రాజకీయాల్లోకి విజయ్ దిగనున్నాడు. అందుకే ఈ సినిమా తరువాత ఇక సినిమాలు చేయనంటూ ప్రకటించాడు. ఈ విషయం విజయ్ అభిమానులను బాధించినప్పటికీ రాజకీయంలోకి వస్తున్నాడనే సంతోషం మాత్రం ఉంది.
ఇక అసలు విషయంలోకి వెళితే... ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి పవర్ ఫుల్ విలన్ ను రంగంలోకి దించుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అతను మరెవరో కాదు యానిమల్ సినిమాతో స్టార్ విలన్ గా మారిపోయిన బాబీ డియోల్. అవును, మీరు విన్నది నిజమే. 90వ దశకంలో అగ్రనటుడిగా బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన బాబీ డియోల్ యానిమల్ సినిమా తరువాత ఫుల్ స్వింగులోకి వచ్చేశాడు. హీరోగా కంటే విలన్‌గానే ఎక్కువ విజయాలు అందుకుంటున్నాడు బాబీ. యానిమల్ సినిమా తర్వాత కూడా విలన్ గా బాబీకి బాగా డిమాండ్ పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. దీంతో ఇప్పుడు విజయ్ ఆఖరి సినిమాలోనూ అతను పవర్ ఫుల్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే విజయ్ నటించిన ‘లియో’లో సంజయ్ దత్ విలన్‌గా నటించగా ఇప్పుడు విజయ్ చివరి సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా మెరవనున్నాడు. బాబీ డియోల్‌కి ఇది మొదటి తమిళ సినిమా కాదు. అతను ఇప్పటికే సూర్యతో కలిసి ‘కనగువ’లో అనే సినిమాలో విలన్‌గా నటించాడు. ఇప్పుడు విజయ్ చివరి సినిమా బాబీ డియోల్ కు రెండో తమిళ సినిమా అవుతుంది. కాగా బాబీ డియోల్ తెలుగులో కూడా బిజీగా ఉన్న సంగతి విదితమే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నాడు. ఇవి మాత్రమే కాకుండా బాబీ హిందీలో ‘ఆల్ఫా’, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించే కొత్త చిత్రంలో నటించనున్నారు.