అర్జున్‌రెడ్డితో మా సినిమాను పోల్చిచూడొద్దు ప్లీజ్ అనంటున్నాడు షాహిద్ కపూర్. మాతృకను కాపీ చేయకుండా కథలోని ఆత్మను నవ్య పంథాలో ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని అన్నారు షాహిద్‌కపూర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న హిందీ చిత్రం కబీర్‌సింగ్. తెలుగులో విజయవంతమైన అర్జున్‌రెడ్డి ఆధారంగా ఈ చి్రత్రాన్ని రూపొందించారు.

 

సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయులతో షాహిద్ కపూర్ పంచుకున్న కబుర్లివి. అర్జున్‌రెడ్డి సినిమాకు నేను అభిమానినే. తెలుగు భాష నాకు అర్థం కాకపోయినా అందులోని పాత్రలు, భావోద్వేగాలు, నటనతో కనెక్ట్ అయ్యాను. రియలిస్టిక్‌గా కొత్తగా ఉందనిపించింది. ముఖ్యంగా విజయ్ అభినయం నన్ను అమితంగా ఆకట్టుకుంటుంది.

 

కొత్త నటులతో పోలిస్తే సీనియర్ నటుల పట్ల ప్రేక్షకుల దృక్కోణం వేరుగా ఉంటుంది. ఇదివరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి ఉండటంతో కొత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకుల్ని సహానుభూతి చెందేలా చేయడానికి సీనియర్ నటులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. గత పాత్రల తాలూకూ ఛాయల్ని మర్చిపోయేలా చేయడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో నటుడిగా నాకు అలాంటి సవాలే ఎదురైంది.

 

ఇదే నా తొలి రీమేక్ సినిమా. కొన్ని రీమేక్‌లు కథను అనుసరించి సాగితే మరికొన్ని క్యారెక్టరైజేషన్ ఆధారంగా సాగుతాయి. కబీర్‌సింగ్ రెండో కోవకు చెందిన సినిమా. ఓ వ్యక్తి భావోద్వేగాలు, ఆటిట్యూడ్ ఆధారంగా సాగుతుంది. పూర్తిగా అర్జున్‌రెడ్డిని కాపీ చేయకుండా మాతృకలోని ఆత్మను యథాతథంగా నవ్యపంథాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పుకుంటూ వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: