సీబీఎఫ్‌సీ సభ్యురాలు, బుల్లితెర నటి వాణి త్రిపాఠి ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంపై మండిపడ్డారు. ఇది హింసాత్మకమైన చిత్రమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రాన్ని చూసిన ఆమె ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అర్జున్‌రెడ్డి’ ఓ చెత్త సినిమా అనుకుంటే ఇప్పుడు దానికి తోడు ఇది వచ్చిందని అన్నారు. ‘కబీర్‌ సింగ్‌’ కథ ఘోరంగా ఉందని, ఇది తనకు కోపం తెప్పించిందని తెలిపారు.

 

‘అర్జున్‌ రెడ్డి’ ఓ చెత్త సినిమా.. ఇప్పుడు దానికి రీమేక్‌ వచ్చింది. ఆదర్శంగా ఉండాల్సిన పెద్ద స్టార్స్‌ ఇలాంటి స్క్రిప్టును ఎంచుకోవడం సరికాదు. సంప్రదాయాల్ని పక్కన పెట్టి.. చిత్ర పరిశ్రమ ప్రయాణం ఇలా సాగితే నటీమణుల పాత్రలు కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం అవుతాయి.

 

మహిళలపై చెడు ప్రభావం చూపే కథలు రాయడం ఆపండి’ అని ఆమె ట్వీట్లు చేశారు. అనంతరం తన ట్వీట్‌కు నెటిజన్‌ నుంచి వచ్చిన కామెంట్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ‘ఓ నటుడు నచ్చిన పాత్రను ఎంచుకోవడంలో తప్పేం ఉందని ఓ వ్యక్తి ప్రశ్నించారు. ఇక్కడ తప్పు, ఒప్పు అనేది విషయం కాదు. ఓ నటుడు వెండితెరపై ఎలాంటి పాత్రను ఎంచుకుంటారన్నది అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

 

‘కబీర్‌ సింగ్‌’ సినిమాకు సీబీఎఫ్‌సీ ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ సినిమా విడుదల తర్వాత రచయిత్రి ‘శోభా డే’ కూడా సినిమాను విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. మరోపక్క ‘కబీర్‌ సింగ్‌’ బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.87 కోట్లు వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: