జనవరిలో వచ్చిన ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ సంచలనం సృష్టించింది. సోలో హీరోగా పెద్ద గుర్తింపు లేని విక్కీ కౌషల్‌ నటించడం, దర్శకుడు ఆదిత్య ధర్‌కు తొలి చిత్రం కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయ్యింది. అయితే బాక్సాఫీసు వద్ద ఆశ్చర్యకరమైన వసూళ్లు రాబట్టింది. అదే నెలలో వచ్చిన ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ కూడా మంచి విజయం సాధించింది.

 

ఫిబ్రవరిలో వచ్చిన ‘గల్లీబాయ్‌’ జోరు చూపించింది. అదే నెలలో వచ్చిన ‘టోటల్‌ ధమాల్‌’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కాసులు కురిపించింది. ‘లుకా చుప్పి’, ‘బద్లా’, ‘కేసరి’ చిత్రాలతో మార్చి నెల సందడిగా సాగింది. కార్తిక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌ నటించిన రొమాంటిక్‌ కామెడీ ‘లుకా చుప్పి’ యువ ప్రేక్షకులను ఆకట్టుకుని దాదాపు రూ.95 కోట్లు వసూళ్లు అందుకుంది. ప్రతీకారం నేపథ్యంలో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సి నటించిన ‘బద్లా’ మెప్పించింది.

 

ఈ నెలలో భారీ అంచనాలతో వచ్చిన ‘కళంక్‌’ చతికిలపడింది. విజయవంతమైన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ మేలో విడుదలైంది. టైగర్‌ ష్రాఫ్‌తో పాటు కొత్త నాయికలు అనన్య పాండే, తారా సుతారియా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. అదే నెలలో వచ్చిన ‘దే దే ప్యార్‌ దే’తో అజయ్‌ దేవగణ్‌ ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకున్నారు. జూన్ నెలలో వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

 

ఈ ఏడాది ప్రథమార్ధంలో సుమారు 50 బాలీవుడ్‌ చిత్రాలు విడుదలయ్యాయి. అందులో మూడు చిత్రాలు రూ.200 కోట్ల మార్కు అందుకున్నాయి. వాటితో కలిపి 8 చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్నాయి. మొత్తంగా ఈ ఆరు నెలల్లో బాక్సాఫీసు వద్ద రూ.1850 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: