‘అర్జున్ రెడ్డి’ సినిమాతో వార్తల్లో నిలిచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు మరోసారి వివాదాన్ని లేవనెత్తారు. ఈ సినిమాను ఆయన ‘కబీర్ సింగ్’ పేరిట హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో మాదిరిగానే హిందీలోనూ ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. ముద్దు సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని, ప్రేమించిన వ్యక్తిపై చేయి చేసుకోవడం ఏంటని చాలా మంది మహిళలు విమర్శించారు. ఈ విమర్శలపై తాజాగా సందీప్ రెడ్డి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


ప్రేమికుల మధ్య ఒకరి చెంపపై ఒకరి కొట్టుకునేంత స్వేచ్ఛలేకపోతే వారి మధ్య ప్రేమ ఉంటుందని తాను అనుకోనని సందీప్ అన్నారు. దీని గురించి మాట్లాడే మహిళలు ఇప్పటి వరకు ప్రేమలో పడిఉండరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ‘మీరు ప్రేమించిన అమ్మాయిని కొట్టనప్పుడు, మీకు నచ్చిప్పుడు ఆమెను తాకలేకపోయినప్పుడు, ఆమెకు ముద్దు పెట్టలేకపోయినప్పుడు, ఆమెపై అసభ్యపదాలు వాడలేకపోయినప్పుడు.. వారి మధ్య ఎమోషన్ ఉంటుందని నేను అనుకోను’ అని సందీప్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఈ వీడియోను ట్వీట్ చేస్తూ సందీప్ వ్యాఖ్యలను గాయని చిన్మయి ఖండించారు. ఒక వ్యక్తి మనల్ని గాఢంగా ప్రేమిస్తే అతను ఎట్టిపరిస్థితుల్లో మనపై చేయి ఎత్తడని చిన్మయి అన్నారు. మన అనుమతిలేకుండా మనల్ని తాకడని పేర్కొన్నారు. ఇలా కొట్టడం ప్రేమకు చిహ్నమా అని ప్రశ్నించారు. తానూ ప్రేమలో ఉన్నానని.. తన భర్త కూడా తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని చెప్పారు. ఆయన ఏనాడూ తనపై చేయిచేసుకోలేదని గుర్తుచేశారు. ఒక వ్యక్తిని మనం గాఢంగా ప్రేమించినప్పుడు వారిని బాధపెట్టే విధంగా మనం ప్రవర్తించమని చిన్మయి పేర్కొన్నారు. అంటే, సందీప్ రెడ్డి వ్యాఖ్యలకు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 


చిన్మయి ట్వీట్‌పై యాంకర్ అనసూయ స్పందించారు. అసలు సందీప్ రెడ్డి వ్యాఖ్యలను తానెప్పుడో ఖండించానని అనసూయ ట్వీట్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా సమయంలో కూడా సందీప్ రెడ్డి ఇలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు సందీప్ వ్యాఖ్యలను అనసూయ ఖండించారు. ఆ విషయాన్ని చిన్మయికి గుర్తు చేస్తూ.. ‘డియర్ ఫెలో స్ట్రాంగ్ ఉమన్ చిన్మయి.. ఈ మనిషి మహిళల పట్ల మొదట్లో చేసిన వ్యాఖ్యలను నేను ఖండించినప్పుడు నువ్వు నా వెనుక నిలబడలేదు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ, ఇప్పుడు నీ స్పందన చూసి నేను చాలా బలపడ్డానని అనుకుంటున్నాను’ అని అనసూయ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: