ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త మూవీ సాహో పై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలున్నాయి. ఇదివరకు ప్రభాస్ నటించిన బాహుబలి రెండు భాగాలూ కూడా అద్భుత విజయాలను అందుకోవడంతో ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ మరియు మార్కెట్ ఏర్పడడం జరిగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళంలో కూడా రూపొందుతున్న సాహోను అన్ని భాషల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతోంది సినిమా యూనిట్. ఇకపోతే ఈనెల 30వ తేదీన థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాను చూసి నాని హీరోగా నటిస్తున్న గ్యాంగ్ లీడర్ మూవీ యూనిట్ లోలోపల బెంబేలెత్తి పోతున్నట్లు సమాచారం. 

దానికి ప్రధాన కారణం, ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ అవుతూ ఉండడమే. వాస్తవానికి నాని గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మతలు ఈనెల 30వ తేదీని తమ సినిమా రిలీజ్ కోసం కొన్ని నెలల క్రితమే ఫిక్స్ చేసారు. ఇక సాహో సినిమాను మొదట స్వతంత్ర దినోత్సవ కానుకగా ఈనెల 15న రిలీజ్ చేద్దామని భావించినప్పటికీ, సినిమాలో విఎఫెక్స్ తదితర అంశాలు లేట్ అవడం వలన సినిమాను మరొక్క 15 రోజులు వాయిదా వేసి ఈనెల 30వ తేదీన రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. దీనితో ఒక్కసారిగా డైలమాలో పడ్డ గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్, ఇప్పటికీ కూడా లోలోపల మధనపడుతోందట. ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య సయోధ్య కుదర్చాలని చూసినప్పటికీ, గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతలు మాత్రం తమ సినిమా అనుకున్న డేట్ కే రిలీజ్ అవుతుందని పట్టుపట్టారట. 

ఇక మరోవైపు రోజురోజుకూ సాహో పై క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుండడంతో, గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతలు ఇకనైనా మనసు మార్చుకుని తమ సినిమా విడుదలను వాయిదా వేసుకుంటారేమో అని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై కొందరు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాంగ్ లీడర్ రిలీజ్ ని కొంతవరకు వాయిదా వేస్తే బెటర్ అని వారు అంటున్నారు, ఎందుకంటే సాహో మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా నడుస్తోందని, ఈ పరిస్థితుల్లో గ్యాంగ్ లీడర్ కాస్త వెనుకబడ్డా, మొత్తం సినిమా రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం లేకపోలేదనేది వారు చెప్తున్న మాట. మరి తమ సినిమా రిలీజ్ విషయమై గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతలు ఎటువంటి స్టెప్ తీసుకుంటారో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: