తెలుగు సినిమా గమనం ప్రారంభమైన తొలినాళ్లలో ఎందరో నటీనటులు చిత్ర సీమకు రావడం, ఆపై నటులుగా మంచి పేరు సంపాదించడం జరిగింది. అయితే ఆ విధంగా అప్పట్లో నటుడిగా పరిచయమైన పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు నటుడిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నటుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించారు. 1904, మార్చి 28న చిత్తూరు జిల్లాలో బ్రాహ్మణ కుటుంబాబికి చెందిన రామలింగ శర్మ, వెంకట లక్ష్మాంబ దంపతులకు నాగయ్య జన్మించారు. ఆయన అసలు పేరు 'ఉప్పలదడియం నాగయ్య శర్మ'. ఆయన బాల్యం అంతా చిత్తూరు జిల్లాలోనే సాగింది, అప్పట్లో నాగయ్య గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్కాలర్షిప్ తో చదువుకోవడం, ఆపై తన డిగ్రీ చదువును కూడా అదే జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. చదువుల అనంతరం ఒక గవర్నమెంట్ ఆఫీసులో కొన్నాళ్లపాటు క్లర్క్ గా పనిచేసిన నాగయ్య గారు, ఆపై కొన్నాళ్ళు ఆంధ్ర పత్రిక తరపున జర్నలిస్ట్ గా కూడా పనిచేయడం జరిగింది. ఇక అప్పట్లో మహాత్మా గాంధీ, మరియు జవహర్ లాల్ నెహ్రు గారి భావాలను ఎంతో ఇష్టపడే నాగయ్య గారు, వారి అడుగుజాడల్లో నడిచి 1930 నాటి దిండి ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. 

అనంతరం సినిమాల మీద ఆసక్తితో తొలుత 1938లో గృహలక్ష్మి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నాగయ్య గారు, నటుడిగా మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించడంతో, అక్కడినుండి ఆయనకు అవకాశాలు మొదలయ్యాయి. ఆపై వందేమాతరం, సుమంగళి, విశ్వమోహిని, దేవత, భక్తపోతన తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నాగయ్య గారు. అంతేకాక అప్పట్లో ఆయన అశోక్ కుమార్, మీరా, చక్రధారి వంటి తమిళ సినిమాల్లో కూడా నటించి తమిళ ప్రేక్షకుల మెప్పు కూడా పొందడం జరిగింది. ఇక అక్కడినుండి కెరీర్ పరంగా ఎన్నో సినిమాల్లో నటించిన నాగయ్య గారు కేవలం నటుడిగానే కాక సంగీత దర్శకుడిగా, సింగర్ గా, నిర్మాతగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేసారు. ఇక ఆయన 1964లో నటించిన రామదాసు చిత్రం, ఉత్తమ తెలుగుచిత్రంగా అప్పట్లో జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆ తరువాత 1965లో నాగయ్య గారిని ఆంధ్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించడం జరిగింది. తెలుగు సినిమా అగ్రనటులు ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి వారు పూర్తిగా నటనలో ప్రవేశించక మునుపే, నాగయ్య గారు తెలుగు చిత్ర సీమలో మంచి గుర్తింపు పొందిన నటుడిగా కొనసాగారు. ఇక అప్పట్లో లక్ష రూపాయల పారితోషికం అందుకున్న ఏకైక నటుడైన నాగయ్య గారిని, ఆ తరువాత పలు సందర్భాల్లో ఎందరో నటీనటులు తొలితరం సూపర్ స్టార్ అని ఆయనను కీర్తించేవారు. ఇక నాగయ్య గారి కుటుంబ జీవితం గురించి  చెప్పాలంటే, మొదట యుక్త వయస్సులో జయలక్ష్మి అనే ఆమెను వివాహమాడిన నాగయ్య గారు, 

ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చి మరణించిన తరువాత, గిరిజ అనే ఆవిడను రెండవ వివాహం చేసుకోవడం, ఆపై కొన్నాళ్ళకు గిరిజ గారు కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి అనారోగ్యకారణాలతో మరణించడం జరిగింది. ఆ తరువాత కొద్దిరోజులకు ఆయన మొదటి భార్య బిడ్డ కూడా మరణించడంతో నాగయ్య గారు కొంత మానసికంగా కృంగిపోవడం జరిగింది. ఇక మెల్లగా తనకు వయసు మీద పడడం, అలానే సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో అప్పట్లో నాగయ్య గారు కొన్నాళ్ళు రమణ మహర్షి గారి ఆశ్రమంలో కొన్నాళ్ళు బస చేసారు. తనకు సంపద ఉన్నంతకాలం చేతికి ఎముక లేకుండా ఎందరికో దానధర్మాలు చేసిన నాగయ్య గారు, జీవితం చరమాంకంలో మాత్రం, డబ్బు లేక దీనమైన స్థితిలో 1973, డిసెంబర్ 30న మరణించడం జరిగింది. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులు తిరుపతిలోనే నివసిస్తున్నట్లు సమాచారం. నాగయ్య గారు భౌతికంగా మన మధ్యన లేకున్నా, వారి సినిమాల్లోని పాత్రలు మాత్రం, మనతో ఎప్పుడూ వారిని మన ప్రక్కనే ఉన్నట్లు గుర్తు చేస్తూ ఉంటాయి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: