మనసు బాగోనప్పుడో, ఆలోచనలు మనసుతో పంచుకునేందుకో, మానసిక ప్రశాంతత కోసమో.. ఒక్కోసారి ఒంటరి ప్రయాణమే మన మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. అది మనం సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రయాణం. కానీ.. ఏ బస్, ట్రెయిన్, విమానంలోనో మనకి మాత్రమే  ప్రయాణం చేసే అవకాశం వస్తే.. అదీ విమానంలో..! 

 

 

 

న్యూయార్క్‌లో ఒక వ్యక్తికి అనుకోకుండా అలాంటి అవకాశమే దక్కింది. తను బుక్‌ చేసుకున్న విమానంలో ప్రయాణించేందుకు వేరెవరూ టికెట్‌ తీసుకోకపోవడంతో ఒక్కడే ప్రయాణించే అవకాశాన్ని కొట్టేశాడు. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ రచయిత, దర్శకుడు విన్సెంట్‌ పియోన్‌ కొలరాడోలోని ఆస్పెన్‌ నుంచి సాల్ట్‌లేక్‌ సిటీలోని తన ఇంటికి వెళ్లేందుకు ప్రయాణమయ్యాడు. విమానాశ్రయానికి వెళ్లిన పియోన్‌ డెల్టా విమానంలో ప్రయాణించేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. మరెవరూ ఆ విమానంలో ప్రయాణించేందుకు టికెట్ తీసుకోలేదని అప్పటికి ఆయనకు తెలీదు. కానీ.. బోర్డింగ్‌ వద్ద సిబ్బంది ఈ విమానంలో ప్రయాణించేది మీరొక్కరే అని చెప్పడంతో మొదట షాక్ గురైనా.. వెంటనే ఆనందడోలికల్లో తేలిపోయాడు. ఒక్క టికెట్టే  అయినా విమానం క్యాన్సిల్ కాకుండా సదరు విమానయాన సంస్థ తనను తీసుకెళ్లడానికి సమాయత్తం కావడమే తన ఆనందానికి కారణం. దీంతో తన ఒంటరి ప్రయాణాన్ని వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘సిబ్బంది నన్ను విమానం వద్దకు తీసుకెళ్తుంటే.. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలా జరిగిందని తెలుసుకున్నాను. విమానంలో నేనొక్కడినే ప్రయాణికుడిని కాబట్టి కార్గో సిబ్బంది విమానంలో బరువు కొసం ఇసుక మూటలు వేశారు. లోపలకు వెళ్లగానే ఎప్పటిలానే తనకు స్వాగతం పలికారు.. ఇవన్నీ చూసి గొప్ప అనుభూతికి లోనయ్యా’ నంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

 

తాను ఒంటరిగా విమానంలో ప్రయాణించిన వీడియోను పియోన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. నిజంగా ఇలాంటి అవకాశం రావడం ఎవరికైనా ఆనందమే కదా! నిజంగా ఆ కిక్కే వేరప్పా!

మరింత సమాచారం తెలుసుకోండి: