టాలీవుడ్ లెక్కలు మారిపోయాయి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ దేశంలో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమలకు సవాలు విసురుతుంది. బాహుబలి వంటి భారీ చిత్రాల నిర్మాణంతో పాటు, వినూత్న మైన చిత్రాలు నిర్మిస్తూ మిగతా పరిశ్రమలకు అన్ని విధాలుగా గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. గతకాలంలో సౌత్ నుండి ఒక్క తమిళ చిత్రాలకు తప్ప మిగతా పరిశ్రమల సినిమాలకు బాలీవుడ్ లో అంత ఆదరణ ఉండేది కాదు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి, దేశంలోని అన్ని పరిశ్రములు తెలుగు సినిమా వైపు చూస్తుండటం గర్వించదగ్గ విషయం.

ఇక వచ్చే రెండు నెలలో టాలీవుడ్ నుండి రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకటి ప్రభాస్ సాహో,మరొకటి  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా. ఈ రెండు సినిమాలు తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషలలో విడుదల కానున్నాయి. సాహో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని 300కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్దా కపూర్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ,మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ,వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కించారు. ఈనెల 30న విడుదల అవుతున్న సాహో మూవీ 330కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా కనుక విజయం సాధిస్తే 500-600కోట్ల వసూళ్లు సాధించడం ఖాయమని తెలుస్తోంది. ఈ మూవీపై ఏర్పడిన క్రేజ్ చూస్తుంటే ఇదేమంత కష్టం కాదనిపిస్తుంది.
 
ఇక రాయలసీమ మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా కూడా 270కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగు,హిందీతో పాటు పలు భాషలలో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అమితాబ్,నయనతార,జగపతిబాబు,విజయ్ సేతుపతి,సుదీప్, తమన్నా వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈసినిమాని సురేంధర్ రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం 700 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

ఈ రెండు సినిమాలు కనుక బాక్సాఫీస్ వద్ద సక్సస్ అయితే బాలీవుడ్ కి టాలీవుడ్ చెక్ పెట్టడం ఖాయం. ఎందుకంటే ఈ మధ్య బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారీ పరాజయాన్ని చూసింది.  బాహుబలితో బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన టాలీవుడ్ ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే ఆ ప్రభంజనం కొనసాగించినట్లవుతుంది. అందుకే బాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకనిర్మాతలు ఈ చిత్ర ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: