మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సైరా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్ పూర్తి కావటంతో ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన సైరా మేకింగ్ వీడియో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంతో పాటు సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. 
 
సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం లుక్ విషయంలో చాలా మారాడు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఒక పాత్రలో నక్సలైట్ గా మరో పాత్ర సాధారణంగా ఉంటుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు. 
 
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ ఇంకా జరుగుతోందని, టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారని, నటీనటులను మాత్రం ఎంపిక చేయాల్సి ఉందని చిరంజీవి తెలిపారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నానని చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన దృష్టి అంతా సినిమాలపైనేనని రాజకీయాలపై ఎలాంటి దృష్టి పెట్టటం లేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవటం గురించి చిరంజీవి రాజకీయాలంటే జీవితకాల పోరాటం అని అన్నారు. రాజకీయాల్లో చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడాలి. పవన్ కళ్యాణ్ ఒక ఫైటర్. నిరంతరం పోరాడేవాడిని విజయం ఏదో ఒక రోజు వరిస్తుంది. ఆ విజయం అందుకోవటానికి పవన్ కళ్యాణ్ అన్ని విధాలా అర్హుడని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేసారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: