జగపతి బాబు టాలీవుడ్ లో రెండో శోభన్ బాబు అని చెప్పాలి. కుటుంబ కథా చిత్రాలు అందులోను ఇద్దరు హీరోయిన్ల తో జతకట్టి ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఆకట్టుకున్నాడు. డాన్స్లు రాకపోయినా కూడా తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేశారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టారు జగపతి. అయితే లెజెండ్ తో విలన్ గా ఏ ముహూర్తంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడో కానీ అప్పటి నుంచి జగపతిబాబుకు తిరుగు లేకుండా పోయింది. ప్రకాశ్ రాజ్ ని మించిపోయారని చెప్పక తప్పదు. ఒకప్పుడు ప్రకాశ్ రాజ్ అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హయ్యెస్ట్ పెయిడ్ విలన్ ఎవరయ్యా అంటే మరో పేరు వినిపించడం లేదు. అయినా కూడా ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సరే జగ్గు భాయ్ డేట్స్ దొరకడం అంత ఈజీగా లేదు. తాజా అప్ డేట్ ప్రకారం ఇంత టైట్ షెడ్యూల్ లోనూ జగపతిబాబు ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నట్టు లేటెస్ట్ న్యూస్.

గతంలోనూ అమెజాన్ ప్రైమ్ నిర్మించిన గ్యాంగ్ స్టార్స్ లో నటించిన జగ్గు అందులో ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పుడిది రెండో వెబ్ సిరీస్. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సిరీస్ లో జగపతి బాబు పోషించే పాత్ర లాయర్ అని తెలుస్తోంది. అందులోనూ అమ్మాయిలను, మహిళలను విపరీతమైన కామదృష్టితో చూసే పేరు మోసిన న్యాయవాదిగా చాలా డిఫరెంట్ గా ఈ రోల్ ఉంటుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కి మెహర్ రమేష్ దర్శకుడని సమాచారం. ప్రభాస్ బిల్లా - జూనియర్ ఎన్టీఆర్ శక్తి, కంత్రి - వెంకటేష్.. షాడోలతో భారీ డైరెక్టర్ గా పేరున్న రమేష్ వాటి బడ్జెట్ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. అందుకే కొంత కాలం మహేష్ టీమ్ లో ఉంటూ దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు.

ఇప్పుడీ వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలనే గట్టి ప్లాన్ లో ఉన్నాడట. అయితే ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉందని తెలుస్తోంది. మిగిలిన నటీనటులు, ఇతర టెక్నీకల్ టీమ్ వివరాలు త్వరలో తెలియనున్నాయని సమాచారం. ఒకపక్క సమంతా లాంటి టాప్ హీరోయిన్స్ ఇటు పక్క జగపతిబాబు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు అందరూ ఇలా వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపడం చూస్తే బాలీవుడ్ మాదిరిగా టాలీవుడ్లోనూ ఈ వెబ్ సిరీస్ కి  మంచి మార్కెట్ వచ్చేలా ఉందని తెలుస్తోంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: