మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహరెడ్డి పై కేవలం టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే కాక, ఇతర భాషలైన కోలీవుడ్, బాలీవుడ్, మోలీవుడ్, శాండల్ వుడ్ లలో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అంతేకాక సైరా ఆయా భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇకపోతే నేడు తెలుగు సహా ఇతర భాషలైన తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా, అన్ని భాషల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందని సైరా టీమ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. 

అయితే గతంలో కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన మెగాస్టార్, మళ్ళి ఇన్నేళ్ల తరువాత సైరాతో అక్కడి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ అలానే ఫర్హాన్ అక్తర్ కలిసి ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను భారీ రేట్ కు కొనుగోలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విషయంలో వారికి ఒక పెద్ద చిక్కే వచ్చి పడిందట. అదేమిటంటే, నిజానికి అదే రోజున సూర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు సెన్సేషనల్ స్టార్ టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ వార్ కూడా సైరా విడుదల రోజైన అక్టోబర్ 2నే రిలీజ్ కానుంది. ఇప్పటికే బాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృతిక్ మరియు టైగర్ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి, అలానే అందుకు తగ్గట్లు సినిమాను కూడా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే రోజున సైరా కూడా రిలీజ్ కానుండడంతో ఒకరకంగా కొంతవరకు రెండిటికీ థియేటర్స్ సమస్యలు ఎదురుకానున్నాయి. 

ఇక అంతకంటే ముఖ్యంగా ఎంతో హైప్ తో, అది కూడా ఇద్దరు బడా బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండడంతో, ఆ సినిమాకు ఏ మాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చినా, దాని ప్రభావం మిగతా బాలీవుడ్ సినిమాలు సహా సైరా పై కూడా పడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు అంటున్నారు అక్కడి సినీ విశ్లేషకులు. మరి అదే జరిగితే సైరాకు పెద్ద దెబ్బె తగలడం ఖాయం. అయితే మరి ఈ రెండు సినిమాల విషయంలో ఏమి జరుగుతుందో పక్కాగా తెలియాలంటే మాత్రం వాటి విడుదల వరకు వేచి చూడాల్సిందే....!!     


మరింత సమాచారం తెలుసుకోండి: