ఇండియన్ సినిమాల్లో సూపర్ స్టార్ ఎవరంటే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని సినీ అభిమానులు ఠక్కున చెప్తారు. డబ్బై, ఎనభైల్లో బాలీవుడ్ సినిమాల్లో ఆయనదే హవా. అశేష అభిమాన బలంతో ఆలిండియా సూపర్ స్టార్ గా వెలిగిపోయారు బచ్చన్. ఇప్పటికీ హిందీ సినిమాల్లో నటిస్తున్న ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఉన్న స్నేహంతో తెలుగులో సైరా.. నరసింహారెడ్డి సినిమాలో నటించారు. గంభీరమైన పాత్రకు ఆయన పర్ఫెక్ట్ గా సూటయ్యారని తాజాగా రిలీజైన టీజరే చెప్తోంది.

 


ముంబైలో జరిగిన ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొన్నారు. అక్కడి మీడియాతో బచ్చన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “ఈ సినిమాలో నరసింహారెడ్డి గురువు పాత్రకు బచ్చన్ సరిగ్గా సరిపోతారని సురేందర్ రెడ్డి చెప్పగానే తాను బచ్చన్ కి ఫోన్ చేసాను. క్యారెక్టర్ గొప్పతనం గురించి చెప్పగానే ‘చేద్దాం..’ అని ఫోన్లోనే తన అంగీకారం చెప్పేశారు. ఆయన షూటింగ్ సమయాల్లో ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేస్తానని చెప్పినా వద్దని వారించారు. ఆతిథ్యం విషయంలో కూడా నా మాటను ఆయన మన్నించలేదు. ‘ఎప్పటినుంచో మనం స్నేహితులం. ఆ స్నేహం కోసమే ఈ పాత్ర చేస్తున్నాను. మనిద్దరం కలిసి నటించడమే ముఖ్యం’ అన్నారు. అది ఆయన గొప్పతనం. బచ్చన్ గారు మాత్రమే నా దృష్టిలో మెగాస్టార్” అని చిరంజీవి చెప్పారు. ‘షూటింగ్ వచ్చినప్పుడు ఆయన ఫ్లైట్ చార్జెస్ కూడా పెట్టనివ్వలేదు. చార్జీలకు ఆయన ఒప్పుకోకపోవడంతో మరెప్పుడూ ఆయనను ఇబ్బందిపెట్టలేదు” అని చరణ్ చెప్పుకొచ్చాడు.

 


అమితాబ్ బచ్చన్ తెలుగులో మనం సినిమాలో నటించినా కేవలం ఫోన్ కాన్వర్సేషన్ లో మాత్రమే కనిపించారు. పూర్తిస్థాయి పాత్రలో చేస్తున్న మొదటి చిత్రం సైరా. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

 



మరింత సమాచారం తెలుసుకోండి: