టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గారు, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా తనకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగారు. ఒకానొక సమయంలో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించిన మెగాస్టార్, ఆపై హీరోగా మారి, తన టాలెంట్ తో వరుసగా సినిమాలు చేస్తూ సుప్రీమ్ హీరోగా, ఆపై మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇకపోతే రేపు తన 64వ జన్మదినాన్ని జరుపుకోబోతున్న మెగాస్టార్ కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి మెగా బర్త్ డే సెలెబ్రేషన్స్ వేడుకలను కాసేపటి క్రితం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మెగా ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగనున్న ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ కుటుంబ సభ్యులు అందరూ హాజరు కానున్నారు. ఇకపోతే కాసేపటి క్రితం తన అన్నయ్య మెగాస్టార్ కు ఒక ప్రకటన ద్వారా పవన్ జన్మదిన శుభాకాంక్షలు తెల్పడం జరిగింది. తనతో పాటు ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయిన చిరంజీవిగారు, నాడు సినిమాల్లోకి ప్రవేశించినప్పటి నుండి నేటి రోజు వరకు ఎంతో వినయం, స్పూర్తితో ముందుకు సాగుతున్నారని అన్నారు. నరసాపురంలో విద్యార్థి దశలో ఎన్సిసి చేసే నాటినుండి, మద్రాసుకు నటన కోసం శిక్షణ తీసుకోవడం వరకు, అలానే ఇప్పటివరకు కూడా ఆయనలో అదే ఉక్కులాంటి క్రమశిక్షణ ఉందని తెలిపారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు, పెద్ద కలలు కని, వాటిని సాకారం చేసుకుపోవడానికి జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నతశిఖరాలకు చేరుకొని, సాధించడం అనేది మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలని, అలానే యావత్ భారతావని విస్మరించిన సమరాగ్రేసరుడు, 

అగణ్య ధీరాగ్రేసరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత గాథను, సైరా అంటూ సినిమా ప్రియులకు పరిచయం చేస్తూ, అటువంటి గొప్ప అద్భుత చిత్రంతో మన ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. చిరంజీవిగారు ఒక జీవిత సందేశం అని, ఆ సందేశాన్ని అందిపుచ్చుకున్న లక్షలాదిమంది యువతరంలో తాను కూడా ఒక పరమాణువునని, అంతకు మించి ఆయనకు తమ్ముడిగా జన్మించడం ఆ భగవంతుడు ప్రసాదించిన వరం అని పవన్ అన్నారు. ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతో జీవించాలని, అలానే ఆయన జీవితం మరింతమందికి స్ఫూర్తి దాయకం కావాలని కోరుకుంటున్నట్లు పవన్ తన ప్రకటనలో తెలిపారు...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: