హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు ఆయన తమ్ముడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మెగాస్టార్ అభిమానుల సాక్షిగా చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్కసారిగా ఆయన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి అన్నయ్యతో అనుబంధం గుర్తు చేసుకున్నారు.


పవన్ ఏమన్నారంటే..

"జీవితంలో న‌న్ను అన్నయ్య మూడు సార్లు దారి త‌ప్పకుండా కాపాడారు. అందుకే ఆయ‌న్ని స్ఫూర్తి ప్రదాత అంటాను. నేను ఇంట‌ర్ ఫెయిలైన‌ప్పుడు నాకు అలాంటి నిరాశ నిస్పృహ క‌లిగింది. అన్నయ్య ద‌గ్గర ఉన్న లైసెన్డ్ పిస్టోల్ తో కాల్చుకుందామ‌నుకున్నాను. నా డిప్రెష‌న్ చూసి ఇంట్లోవాళ్లు అన్న‌య్య ద‌గ్గర‌కు తీసుకెళ్లారు. నువ్వు ముందు బ‌త‌కాలిరా బాబూ.. ఇంట‌ర్ పెద్ద విష‌యం కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు! అన‌డం స్ఫూర్తి నింపింది ఆరోజు.


అందుకే ఆత్మహ‌త్యలు చేసుకున్న ఇంట‌ర్ విద్యార్థుల్ని .. ఆ బిడ్డల్ని చూసి బాధ క‌లిగింది. రాజ‌కీయ నాయ‌కుల్ని త‌ప్పు ప‌ట్టొచ్చు. కానీ.. ఇంట్లో పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్లు ఉండి ఉంటే బావుండేది అనిపించింది.. చిన్నప్పుడు భార‌త‌దేశాన్ని ఎవ‌రైనా ఏదైనా అంటే కోపంతో ఊగిపోయేవాడిని. దేశం స‌మాజం అంటే నాకు గొప్ప ప్రేమ‌. అయితే నా కోపాన్ని త‌గ్గించింది అన్నయ్యనే. కులం మ‌తం ను మించి మాన‌వ‌త్వం అనేది ఒక‌టి ఉంటుంద‌ని న‌న్ను ఎక్స్ ట్రీమిటీకి వెళ్లకుండా ఆపేశారు అన్నయ్య‌.


22 వ‌య‌సులో తిరుప‌తికి వెళ్లిపోయాను. నిర్మాత‌ తిరుప‌తి ప్రసాద్ గారిని క‌లిసి 5-6 నెల‌లు యోగాశ్రమంలో ఉండిపోయాను. నేను ఆ దారిలోనే ఉండాల‌నుకున్నా. కానీ భ‌గవంతుడు అయ్యి వెళ్లిపోతే నువ్వు స్వార్థ ప‌రుడివి. ఇంట్లో బాధ్యతలు ఉంటే నువ్విలా చేయ‌వు!! అని అన్నయ్య అన్నారు. త‌ను క‌ష్టప‌డి న‌న్ను నిల‌బెట్టాడు అన్నయ్య. అందుకే ఆయ‌న స్ఫూర్తి ప్రధాత‌. ఈ మూడు సంఘ‌ట‌న‌ల్లో దెబ్బలు తిన్నా న‌న్ను నిల‌బెట్టారు... అని ఉద్వేగభరితంగా ప్రసంగించారు పవన్ కల్యాణ్..


మరింత సమాచారం తెలుసుకోండి: