సాధారణంగా ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుందంటే ఆ సినిమాని అంతకముందు వచ్చిన సినిమాతో కంపేర్ చేయడం ఇండస్ట్రీలో కామన్. అలాంటి కంపేరిజనే సైరా విషయంలోను వస్తుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సైరా ప్రమోషన్ కార్యక్రమాలు బాగా ఊపందుకున్నాయి. మేకింగ్ వీడియోతో పాటు టీజర్ ను ఒకే వారంలో రిలీజ్ చేయడంతో మెగా అభిమానుల ఆనందం మాములుగా లేదు. అయితే సోషల్ మీడియాలో అత్యుత్సాహ పడుతున్న కొందరు నెటిజెన్లు సైరా లోని సీన్లు బాహుబలి నుంచి స్ఫూర్తి చెందినట్టు ఉన్నాయని రెండింటిని పోలుస్తూ ఫోటోలతో సహా పెట్టేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవడమే కాదు ఇవి కాస్తా వైరల్ గాను అవుతున్నాయి.

చిరంజీవి బ్రిటిష్ సైనికుల మధ్యలో నుంచి పైకి ఎగిరి కత్తులు దూయడం, పొదల్లో నుంచి గుర్రంపై స్వారీ చేస్తూ రావడం లాంటి రెండు మూడు సన్నివేశాలను కొందరు నెటిజన్లు కంపేర్ చేస్తున్నారు. అయితే అలాంటి షాట్స్ కొన్ని బాహుబలిలో ఉన్నట్టు అనిపించే మాట వాస్తవమే కాని యుద్ధ నేపథ్యాలు రెండు సినిమాల్లో కామన్ గా ఉన్నాయన్న పాయింట్ ని ఇక్కడ ఎవరు కూడా మర్చిపోకూడదు. అంతేకాదు వాస్తవంగా చెప్పాలంటే అసలు ఇలాంటి కంపేరిజన్స్ చేయడం కూడా సబబు కాదని చెప్పాలి.

ఎందుకంటే బాహుబలి 1,2 కూడా చాలా రకాలుగా స్ఫూర్తి చెందినవే. అప్పట్లో 300 లాంటి సినిమాల బిట్స్ ని మ్యాచ్ చేస్తూ ఇలాంటి కంపేరిజనే వచ్చాయి. ఆ విషయం ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సైరాకు రిపీట్ అవుతున్నాయి అంతే. రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఇలాంటి విజువల్ వండర్స్ ప్రతిసారి వచ్చేవి కావు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్లు చేసినప్పుడు ఇలా పోలికల పేరుతో వాటిని తక్కువ చేస్తూ వైరల్ చేయడం వాటిలోనూ మన తెలుగు సోషల్ మీడియా వాళ్ళే ఉండటం నిజంగా బాధాకరం. ఒకరకంగా మన తెలుగు సినిమా స్థాయిని మనమే నాశనం చేస్తున్న వాళ్ళమవుతామనడంలో ఏమాత్రం సందేహం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: