‘సాహో’ మ్యానియా పీక్ కు చేరడంతో ఈ మూవీ విడుదల కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక సునామీ వచ్చినప్పుడు ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయి అన్నట్లుగా ‘సాహో’ దెబ్బకు భయపడి ఏకంగా ఈ రోజు 13 చిన్న సినిమాలు విడుదలకావడం హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి ఈ సినిమాలు అన్నీ సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తూ ఇప్పటి వరకు ఆగినా వచ్చే వారం ‘సాహో’ ఆ తరువాత కేవలం నెలరోజుల గ్యాప్ తో ‘సైరా’ వస్తున్న నేపధ్యంలో చిన్న సినిమాలకు శాపంగా మారింది. ఇక తమ సినిమాలకు ఇప్పట్లో రిలీజ్ డేట్ దొరకడం కష్టం అని గ్రహించి ఇలా ఒకదాని పై ఒకటి పోటీగా ఈ రోజు 13 చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  

ఈరోజు విడుదల అవుతున్న చిన్న సినిమాల లిస్టును చూస్తే వాటిలో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలు విడుదల అవుతున్నట్లు సినిమాలను బాగా చూసే ప్రేక్షకులకు కూడ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ ‘హవా’ ‘ఏదైనా జరగచ్చు’ ‘నేనే కేడీ నెంబర్ 1’ ‘దండుపాల్యం 4’ ‘పండుగాడి ఫోటో స్టూడియో’ ‘బాయ్’ ‘అశ్వమేధం’ ‘నీతోనే హాయ్ హాయ్’ ‘జిందా గ్యాంగ్’ తో పాటు ఇంకా అడ్రస్సు లేని చాల చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. 

వీటిలో ‘కౌసల్య కృష్ణమూర్తి’ ‘బాయ్’ ‘నేనే కేడీ నెంబర్ 1’ ‘ఏదైనా జరగొచ్చు’ మూవీల పేర్లు తప్ప మిగతా సినిమాల పేర్లు కనీసం ప్రచారంలో కూడ కనిపించడం లేదు. ఈ 13 చిన్న సినిమాల మీద పెట్టిన పెట్టుబడి కనీసం 40 కోట్ల వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ సునామీని పట్టించుకోకుండా విడుదల అవుతన్న ఈ సినిమాలు కనీసం రెండవ వారం పోస్టర్ అయినా దక్కించుకుంటాయా అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: