ఇల్లు కట్టడానికి సిమెంటు, ఇసుక, కాంక్రీటు.. ఇలా చాలా అవసరమవుతాయి. సినిమా ఆర్ట్ డైరక్టర్లు మాత్రం కొత్త కొత్త టెక్నాలజీతో ఇల్లు కట్టడం ఇంత సులువా అన్నట్టు సెట్లు వేసేస్తారు. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కోసం కూడా యూనిట్ ఇలానే ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ తో ఓ ఇల్లు కట్టించేశారు. అదీ సిమెంటు, కాంక్రీట్ లేకుండా..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

 

 

గ్రామీణ నేపథ్యం ఉన్న కథ కావడంతో దాదాపు ఎనభై.. తొంభై ఏళ్లనాటి ఇల్లు కావాలనుకున్నారు. రాజమండ్రిలోని కొన్ని ఇళ్లు నచ్చినా వీలుకాక ఇంటి సెట్ వేసేశారు. ఇందుకు హైదరాబాద్‌ శివారులో ఎకరం స్థలంలో ఇంటిని నిర్మించారు. అన్ని జాగ్రత్తలతో ఈ సెట్‌ని డిజైన్‌ చేశారు. ఇంటి నిర్మాణంలో సిమెంట్ ఏమాత్రం వాడకుండా 12 అడుగుల ఎత్తున్న టెంపుల్‌ స్టోన్‌ పిల్లర్స్‌ ను ఫైబర్‌తో తయారు చేశారు. మజైకాతో ఫ్లోరింగ్‌, రబ్బరు, జిప్సమ్‌ ఉపయోగించారు. కేవలం గుమ్మాలలోనే టేకు ఉపయోగించారు. ఇంటి పరిసరాల అందం కోసం కడియం నుంచి 5 లక్షల విలువైన మొక్కల్ని తీసుకొచ్చారు. ఆ ఇంట్లో కనిపించే ఫర్నీచర్, ఇంటీరియర్ అంతా సినిమా కోసం కొన్నవి కొన్ని, తయారు చేసినవి కొన్ని, పల్లెటూళ్లలో సేకరించినవి కొన్ని ఉన్నాయి.

 


గతంలో ఇలాంటి సెట్లకు మంచి గుర్తింపు వచ్చింది. చూడాలని ఉందిలో కలకత్తా హౌస్ సెట్, ఒక్కడులో చార్మినార్, అర్జున్ లో మధుర మీనాక్షి ఆలయం, మర్యాదరామన్న, అత్తారింటికి దారేదిలో ఇళ్ల సెట్టింగులు ఇలా నిర్మించినవే. వాటికి మంచి గుర్తింపు వచ్చింది. మగధీర క్లైమాక్స్ లో హెలికాప్టర్ కూడా సెట్టే. మర్యదారామన్న ఇంటిని అల్లు అరవింద్ చెక్కు చెదరనీయలేదు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా అరవింద్ కు బాగా నచ్చిందని సమాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: