విశ్వ న‌ట‌చ‌క్రవ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న.. ఆదివారం ఉద‌యం 10.15 నిమిషాల‌కు ఎస్వీఆర్ అభిమానుల స‌మ‌క్షంలో ప‌ద్మభూష‌ణుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కర‌ణ జ‌ర‌గ‌ుతుందని ముందుగా ప్రకటించారు.


అయితే ఈ ఆవిష్కర‌ణ కార్యక్రమాన్ని కార‌ణాంత‌రాన వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. విగ్రహావిష్కర‌ణ‌కు ప్రభుత్వం నుండి అనుమ‌తులు ఇంకా మంజూరు కాలేదు. త్వర‌లోనే కొత్త తేదీని ప్రక‌టిస్తామ‌ని నిర్వాహకులు వెల్లడించారు. మరి ముందుగా అనుమతులు రాకుండానే నిర్వహణ తేదీని ఎందుకు ప్రకటించారన్నది మాత్రం తెలియరాలేదు. ఏదేమైనా కాస్త ఆలస్యంగానైనా చిరంజీవి చేతుల మీదుగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ జరగడం సంతోష దాయకమే.


ఈ నేపథ్యంలో ఎస్వీఆర్ గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం.. ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జ‌న్మించారు. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు.


రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు- మాంత్రికుడు వంటి ఎన్నో ప్రతినాయక పాత్రలతో గొప్ప న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘీకంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: