యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం టికెట్ల ధరలను పెంచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .   ఈ నెల 30వ తేదీన సాహో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.  ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించారు . ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ తో పాటు, కీలక పాత్రల్లో బాలీవుడ్ , కోలీవుడ్ నటులు నటించారు . ఈ సినిమా కు  బాహుబలి సినిమా  కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేశారన్న ప్రచారం టాలీవుడ్ లో జరుగుతోంది .   సుమారు 350 కోట్ల బడ్జెట్ తో సాహోచిత్రం తెర కెక్కినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి . 


అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఓపెనింగ్ లోనే భారీ వసూళ్లు రాబట్టుకోవాలని  నిర్మాతలు భావిస్తున్నారు.  ఈ మేరకు తొలి రెండు వారాల పాటు  సాహో చిత్రం టికెట్ల ధరలు  పెంచుకునేందుకు అనుమతించాలని అటు  ఆంధ్ర ప్రదేశ్, ఇటు  తెలంగాణ ప్రభుత్వాలకు దర్శక,  నిర్మాతలు విజ్ఞప్తి చేశారు .  సాహో చిత్రనిర్మాత లైన యు.వి.క్రియేషన్స్ విజ్ఞప్తి పట్ల  జగన్మోహన్ రెడ్డి  సర్కార్ సానుకూలంగా స్పందించి టికెట్ల ధరలను  పెంచుకునేందుకు అనుమతినిచ్చింది . దీంతో సాహో చిత్రాన్ని ప్రదర్శించే  థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు అవకాశం లభించినట్లయింది.  తొలి రెండు వారాల పాటు సాహో  సినిమా టికెట్ల ధరలు 100 నుంచి 200 వరకు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 


గతంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా కు  కూడా ఆనాటి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  ఇలాంటి అనుమతులు ఇచ్చారు.  తెలంగాణలోనూ టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కెసిఆర్ ప్రభుత్వానికి యు.వి.క్రియేషన్స్ విజ్ఞప్తి చేయగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లభించలేదు.  సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉండడంతో కేసీఆర్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి అవకాశాలున్నాయని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: