బాలీవుడ్ క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్‌ మీద తరచుగా విమర్శలు వస్తుంటాయి. ఆయన రివ్యూలు నిష్పక్షపాతంగా ఉండవని.. కొన్ని సినిమాలు చాలా సాధారణంగా ఉన్నా ఆకాశానికెత్తేస్తాడని.. కొన్ని చిత్రాలపై ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేస్తాడని ఆరోపణలు వస్తుంటాయి. షారుఖ్ ఖాన్ మీద అదేపనిగా విషం చిమ్మే ఆయన.. సల్మాన్ సినిమాల మీద మాత్రం అమితమైన ప్రేమ చూపిస్తాడు అనడానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. 


షారుఖ్ కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిన ‘చక్ దె ఇండియా’ సినిమాకు కేవలం 2 స్టార్ రేటింగ్ ఇచ్చాడు తరణ్. కానీ సల్మాన్ లేటెస్ట్ ఫ్లాప్ మూవీ ‘భారత్’కు మాత్రం 3.5 రేటింగ్ ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర సల్మేనియా చూడబోతున్నామంటూ ఊదరగొట్టాడు. కానీ ఈ రెండు సినిమాల ఫలితాలు తిరగబడ్డాయి.


ఐతే బాలీవుడ్ సినిమాల గురించి తరణ్ ఏం మాట్లాడితే ఏంటి కానీ.. మన ‘సాహో’ను కూడా తరణ్ టార్గెట్ చేశాడు. ఈ సినిమాకు 1.5 రేటింగ్ ఇచ్చి.. భరించలేని సినిమాగా పేర్కొన్నాడు. ‘సాహో’కు తెలుగులో కూడా నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. కానీ మరీ తరణ్ లాగా ఎవరూ దారుణమైన కామెంట్లు చేయలేదు. 


ప్రభాస్.. బాలీవుడ్ బడా హీరోల్ని మించి ఎదిగిపోతున్నాడనే అక్కసుతో.. ఉత్తరాదిన సౌత్ సినిమాల హవాను భరించలేక ఒక ప్లాన్ ప్రకారమే బాలీవుడ్ క్రిటిక్స్ ‘సాహో’ మీద నెగెటివ్ ప్రచారానికి నడుం బిగించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరణ్ రివ్యూ కూడా అందులో భాగమే అని భావిస్తున్నారు. 


కానీ ‘సాహో’ను అలా తెగిడిన నోటితోనే తరణ్ పొగడక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ చిత్రం హిందీలో వసూళ్ల మోత మోగిస్తోంది. రివ్యూలతో సంబంధం లేకుండా ‘సాహో’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. తొలి రోజు రూ.24.5 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. రెండో రోజు డ్రాప్ కాకపోగా.. ఇంకా వసూళ్లు పెంచుకుంది. రూ.26 కోట్ల దాకా వసూలు చేసింది. ఆదివారం ఇంకా వసూళ్లు పెరిగాయి. రూ.29 కోట్లకు పైగా వచ్చాయి. హిందీ మార్కెట్లో ప్రభాస్ స్టామినా చూసి ఆశ్చర్యపోతూ.. ‘సాహో’ వసూళ్లకు విస్మయం చెందుతూనే.. ఈ సినిమాను పొగుడుతూ రోజూ కలెక్షన్ల అప్ డేట్స్ ఇస్తున్నాడు తరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: