పాత హీరోయిన్లు అంటే ముందుగా గుర్తొచ్చేది సావిత్రి, జమున, అంజలీ దేవి.. ఇలా.. వీరిలో ఇప్పటికే సావిత్రి బయోపిక్ ను మహానటిగా తీసి చరిత్ర సృష్టించారు. ఏకంగా జాతీయ అవార్డు కూడా కొట్టేశారు. హీరోయిన్ల జీవితాల్లో ఉంటే భావోద్వేగాలు సినిమాలకు సరిగ్గా సరిపోతాయి. అయితే తన బయోపిక్ తీయాలంటే చాలా కష్టం అంటున్నారో ఓ సీనియర్ నటీమణి.


ఆమే జమున.. అలనాటి అందాల తారగా జమున అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. వెండితెర సత్యభామగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి పొగరుబోతు అమ్మాయిగా బాగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. హరనాథ్ .. జగ్గయ్య వంటి స్టార్ హీరోలతో ఆమె ఎన్నో సినిమాలు చేశారు. అలాంటి జమున తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసువిప్పి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో బయోపిక్ ల గురించి టాపిక్ వచ్చినప్పుడు జమున ఇలా స్పందించారు.


ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో నా బ‌యోపిక్ చేసేంత సీన్ ఎవ‌రికీ లేద‌న్నారు. నాలాగా న‌టించ‌డం, అంత‌టి హావ‌భావాల్ని ప‌లికించ‌డం. అంత అందం నాకెవ్వరు స‌రిరారు అని ఆమె అన్నారు. పాత పాటలు .. ఆ పాటల్లో నా లుక్స్ .. హావభావాలను పలికించిన తీరును చూసుకుంటాను. 'జమున ఎంత గొప్పగా చేశావ్ .. ఎంత అందంగా వున్నావ్ .. ఎంత అదృష్టవంతురాలివే' అంటూ నా అందాన్ని నేనే పొగుడుకుంటూ వుంటాను..


"జమునకి పొగరెక్కువ .. అహంకారి .. గర్విష్టి అని కొంతమంది అనుకునేవాళ్లు. నేను వేసిన పాత్రలు ఆ తరహావే కావడం వల్లనే నాకు ఈ టైటిల్స్ పెట్టడానికి కారణమై ఉండొచ్చునని నేను అనుకుంటూ వుంటాను. ఆ పాత్రల ప్రభావం కూడా నాపై ఉండొచ్చునేమో. నిజంగానే నేను గర్విష్టినైతే సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో ఉండగలిగే దానినా? 40 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో వున్నాను. 25 సంవత్సరాల పాటు ఏకధాటిగా హీరోయిన్ గా చేశాను అని ఆమె అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: