దర్శకరత్న దాసరి నారాయణరావు తాత-మనవడు సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టారు. అప్పటికే ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ వంటి వాళ్ళు ఉన్నప్పటికి వాళ్ళతో కమర్షియల్ సినిమాను ట్రై చేయకుండా ఎస్.వీ.రంగారావు, రాజబాబు తో తెరకెక్కించి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా దాసరి గారి సినీ కెరీర్ లోనే కాదు సినిమా చరిత్రలో కూడా ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి కథలను ఒక కమర్షియల్ సినిమాగా మలచడం చాలా కష్టం. అలాంటిది దాసరి గారు తన మొదటి సినిమాతోనే ఇంత పెద్ద సాహసం చేశారంటే కుటుంబ కథా చిత్రాలకు ఎంతో ఆదరణ ఉంటుందనే గట్టి నమ్మకమే ముఖ్య కారణం అని చెప్పాలి. ఇప్పుడు ఇదే ఫార్ములాను యువ దర్శకుడు మారుతి దాసరి ఫాలో అవుతున్నాడు.

'తాతకు నువ్వు చేసే మర్యాద రేపు నేను నీకు చేయాలి కదా' అనే మాటతో తండ్రికి పాఠం చెప్పే మనవడి కథ. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు దాసరి మారుతి తాత మనవళ్ల అనుబంధాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రతి రోజు పండగే అంటూ ఆసక్తికరమైన టైటిల్ పెట్టి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు మారుతి. ఇప్పటికి సగానికి పైగా పూర్తి చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం రీసెంట్‌గా విడుదల చేసారు. 

వర్షంలో తాత ఆనందంగా హుషారుగా చిందులు వేస్తుంటే, గొడుగు పట్టుకున్న మనవడు ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన వైఖరితో వారించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ పస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు. పచ్చని పల్లెటూరి పరిసరాల నేపథ్యం సమకూర్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఖచ్చితంగా ఫ్యామిలి బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అని అర్థమవుతోంది. ఇక ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాని చేయలేదన్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్రలహరి అనే కుటుంబ కథా చిత్రం తో హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ అదే జానర్ లో సినిమా చేయడం విశేషం. 

ఇప్పటి వరకు ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో సినిమాలు అందిస్తూ వస్తున్న దర్శకుడు మారుతి తొలిసారి ఎమోషనల్ కంటెంట్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాతగా సత్యరాజ్, మనవడిగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్. యువి క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఏదేమైనా మారుతి తన పంథా మార్చుకొని కాస్త ఫ్యామిలి చిత్రాల మీద దృష్టి పెట్టాడనమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: