దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు భాషకున్న గొప్పదనం ఏంటో ప్రపంచ స్థాయిలో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అంతేకాదు మన తెలుగు సినిమా స్థాయి ఎప్పుడో పెరిగింది. తెలుగు ప్రేక్షకుల ఆలోచనల స్థాయిలోనూ ఎంతో మార్పు కనిపిస్తోంది. భాష ఏది.. నటుడు ఎవరు?.. అనేవి చూడకుండా పక్క రాష్ట్రాల సినిమాలని ఎంతో గౌరవిస్తున్నారు. కళకు సరిహద్దులు లేవు అన్నది మనవాళ్లే నిరూపించారు. అంతేకాదు ఇతర భాషల సినిమాలని గౌరవించే సాంప్రదాయం మనకు ఉన్నట్టే పొరుగు పరిశ్రమకు వెళ్లి మనవాళ్లు దండయాత్ర చేసి వస్తున్నారు. మొన్నటికి మొన్న మన డార్లింగ్ ప్రభాస్ హిందీ పరిశ్రమపై దండయాత్ర చేసి వచ్చాడు. సాహో రిజల్ట్ తెలుగులో ఎలా ఉన్నా హిందీలో బాక్స్ లు బద్దలు కొట్టింది. ఈ సినిమాకి తెలుగు కంటే హిందీలో ప్రమోషనే ఎక్కువ. అంతకు ముందు బాహుబలి 2 చిత్రంతో ఇండియా నంబర్ 1 రికార్డు మన తెలుగు వారి ఖాతాలోనే ఉంది. ఇప్పటికీ ఇండియాలో మన బాహుబలినే నంబర్ వన్.

అంతటి ప్రాధాన్యత ఉన్న మన తెలుగు భాష ఒక వెలుగు వెలుగుతోంది. అయితే మన భాషకు గౌరవం ఎలా ఉందో  తాజాగా రిలీజైన వార్ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. ఈ పోస్టర్ లో ఉన్న అచ్చు తప్పులన్ని మన వాళ్ళని షాక్ కి గురి చేస్తున్నాయి. హృతిక్ పేరును హృథిక్ అని.. యశ్ రాజ్ పేరును యష్ రాజ్ అని.. ఆదిత్య చోప్రా పేరును ఆదిత్య ఛోప్ రా అని ప్రింట్ చేశారు. అసలు ఈ అనువాదకుడు ఎవరో కానీ కనీసం గూగుల్ లో చెక్ చేసినా కరెక్షన్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. ఇంతకీ ఇలా అనువదించినది ఎవరు?  హిందీ మీడియంలో చదువుకున్న తెలుగువాడా? లేక తెలుగు మీడియంలో చదువుకున్న హిందీ వాడా? అన్నది తెలిస్తే మన వాళ్లంతా తాట తీసేవారేమో.

హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ల వార్ .. ఈ అక్టోబర్ 2న సైరా-నరసింహారెడ్డి సినిమాతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన వార్ పోస్టర్ ని చూస్తే తెలుగు మార్కెట్ వాళ్లకు అవసరం లేదన్నది స్పష్టంగా అర్థమైపోతోంది. పోస్టర్ విషయంలోనే అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే సినిమా ఇక్కడ ఆడినా ఆడకపోయినా పర్వాలేదనే భావంతో ఉన్నారని తెలుస్తోంది. సైరా ను బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్ - రవీనా టాండన్ లాంటి పేరున్న వాళ్లే రిలీజ్ చేస్తున్నారు. సైరాను అనువదించి రిలీజ్ చేస్తున్నా చిరంజీవి- రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి బృందం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. దానికి తగ్గట్టే మనవాళ్లు వాళ్ళంత అంత కేర్ లెస్ కాదు. ప్రతిదీ పకడ్భందీగా రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రచారంలో ఇలాంటి తప్పులు దొర్లే అవకాశమే లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: