మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు 270 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈరోజు సైరా సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతూ ఉండగా ఈ నెల 22వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. 
 
సైరా సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన లెక్కలు అన్నీ బయటకు వస్తున్నాయి. సైరా సినిమా అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులను 120 కోట్ల రుపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. సాహో సినిమా హక్కులను కూడా ఇదే మొత్తానికి అమ్మారు కానీ శాటిలైట్, డిజిటల్ హక్కులను వేరు వేరుగా అమ్మారు. సాహో డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్లు సమాచారం. 
 
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీ మొత్తంలో ఆఫర్లు వస్తున్నా సినిమా విడుదలకు ముందు వరకు వేచి ఉండాలని నిర్మాత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమా శాటిలైట్ రైట్స్ 16 కోట్ల రుపాయలకు ఒక ప్రముఖ ఛానల్ తీసుకుందని సమాచారం. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ రైట్స్ కూడా దాదాపు ఇంతే మొత్తానికి అమ్ముడయ్యాయి. 
 
ఇప్పటివరకు శాటిలైట్, డిజిటల్ హక్కుల్లో రికార్డు రోబో 2.0 పేరు మీద ఉంది. దాదాపు 170 కోట్ల రుపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. సినిమా నిర్మాతలకు కూడా థియేటర్ హక్కుల కంటే శాటిలైట్ హక్కులే భారీగా లాభాలను ఇస్తున్నాయి. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు 9 కోట్ల రుపాయల కంటే ఎక్కువ ధర పలికిందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: