మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా సైరా నరసింహారెడ్డి. మరో రెండు వారాల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. దాదాపు 270 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం సైరా నరసింహారెడ్డి సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన సైరా సినిమా టీజర్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. 
 
దసరాకు విడుదల కాబోతున్న ఈ సినిమా టికెట్ రేట్లు ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తుంది. సైరా సినిమా టికెట్ రేట్లు పెంచటం కొరకు ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం అందుతుంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచటం కామన్ అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచటానికి ఒప్పుకోవటం లేదు. గత నెలలో భారీ అంచనాలతో విడుదలైన సాహో టికెట్ రేట్ల పెంపు కొరకు అనుమతి అడిగినా తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సాహో సినిమా టికెట్ రేట్ల పెంపు కొరకు అనుమతి ఇవ్వటంతో సైరా సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అమెరికాలో కూడా సైరా సినిమా టికెట్ రేటు సాధారణ రేటు కంటే మూడు డాలర్లు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దసరాకు విడుదలవుతుందని భావించిన వెంకీమామ రేసు నుండి తప్పుకోవటంతో సైరా సినిమాకు పోటీనిచ్చే సినిమా కూడా లేదు. 
 
సైరా సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు 120 కోట్ల రుపాయలకు ఒక ప్రముఖ ఛానల్ తీసుకుందని సమాచారం. సైరా సినిమా విడుదలకు ముందే నిర్మాత రామ్ చరణ్ కు భారీగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: