చిరంజీవి బయోపిక్ గురించి టాపిక్ మరోసారి మెగా హీరో నోటి వెంట వచ్చింది. మెగాస్టార్ సినీజీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తే బాగుంటుందని హీరో వరుణ్ తేజ్ కూడా తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు. అంతేకాదు ఒకవేళ ఆ అవకాశం వస్తే చిరంజీవి పాత్ర పోషించడానికి కూడా నేను రెడీ అని ప్రకటించాడు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ బయోపిక్ డైరక్టర్ ఎవరో కాదు ఈ వారం వాల్మీకి తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్. 

"చిరంజీవి బయోపిక్ తీస్తానని హరీష్ శంకర్ నాతో అన్నాడు. చిరంజీవిని నేను లవ్ చేసినంతగా ఎవ్వరూ లవ్ చేయలేదు, మెగాస్టార్ బయోపిక్ తీస్తే నేనే తీస్తానంటున్నాడు హరీష్. చిరంజీవిగారి బయోపిక్ చరణ్ అన్న చేస్తేనే బాగుంటుంది. చరణ్ అన్న చేయకపోతే మాత్రం నెక్ట్స్ నేనే." అంటు ఇలా చిరంజీవి బయోపిక్ మేటర్ ను బయటపెట్టాడు వరుణ్ తేజ్. 

హరీష్ ఈ బయోపిక్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తాడో తనకు తెలియదని, కానీ ఏదో ఒకరోజు చిరంజీవి బయోపిక్ ను హరీష్ చేస్తాడని అంటున్నాడు వరుణ్. తనకు చిరంజీవి పాత్ర పోషించే అవకాశం వస్తే మాత్రం గ్రాఫిక్స్ లో హైట్ తగ్గించుకుంటానని కూడా చెబుతున్నాడు. చిరంజీవి బయోపిక్ పై ఇప్పటికే కొంతమంది మెగా హీరోలు స్పందించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ బయోపిక్ కు ఇంకా చాలా టైమ్ ఉందని గతంలో చిరంజీవి, అల్లుఅర్జున్ అభిప్రాయపడగా.. అసలు చిరంజీవి కెరీర్ ను సినిమాగా తీయకుండా ఉంటేనే బెటరని ఒక సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.

మరోవైపు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చర్చ జరుగుతోంది. అయితే ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో, చిరంజీవి బయోపిక్ ను టచ్ చేయకుండా ఉండడమే బెటర్ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక వాస్తవంగా చూస్తే ఇప్పుడప్పుడే మెగాస్టార్ బయోపిక్ తీయకపోతేనే చాలా ఉత్తమం. ఎందుకంటే ఖైదీ నంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు 270 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరా త్వరలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి మరెన్నో విభిన్నమైన కథాంశాలతో మెగాస్టార్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాల్సి ఉంది. అందుకే మరో పదేళ్ళ వరకు చిరు బయోపిక్ టాపిక్ తీయకపోతేనే కరెక్ట్.  



మరింత సమాచారం తెలుసుకోండి: