మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకి సినిమా రేపు విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్ గా వస్తోంది. సినిమాలో వరుణ్ తేజ్ మేకోవర్ పై ప్రశంశలు వస్తున్నాయి. సినిమాపై ప్రేక్షకుల్లో అంచానాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే.. ఈ సినిమాపై కొన్నాళ్లుగా ఓ వివాదం నడుస్తోంది. సినిమా టైటిల్ 'వాల్మీకి'ని మార్చాలంటూ బోయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.                                 



ఈ సినిమా టైటిల్ వారు ధర్నాలు చేశారు. అనంతరం హైకోర్టులో కేసు కూడా వేశారు. సినిమా టీమ్ కు కూడా టైటిల్ మార్చాలని లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ను కలిసి కూడా ఓ వినతిపత్రం అందించారు. సినిమా టైటిల్ తమ మనోభావాలను దెబ్బతీస్తోందని వివరించారు. హీరో క్యారెక్టర్ ను విలనిజంలో రఫ్ గా చూపిస్తూ వాల్మీకి అనే టైటిల్ ఎలా పెడతారంటూ వారు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈనెల 18న ఈ టైటిల్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. టైటిల్ మార్చేంతవరకూ సినిమా విడుదలను నిలుపుదల చేయాలన్న బోయ సంఘాల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో వాల్మీకి సినిమా ఈనెల 20న విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందనే చెప్పుకోవాలి.



సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే పెట్టామని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్తున్నారు. మరి సినిమా విడుదల తర్వాత సినిమా యూనిట్ చెప్పిన ప్రకారం టైటిల్ కు వాల్యూ ఇచ్చారా, లేదా బోయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టే వుందా అనేది మరో రోజులో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: