270 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న మెగా మూవి సైరా. మెగాస్టార్ 151 వ సినిమాగా రూపొందిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న, కొణిదెల నిహారిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే రేట్ల పెంచాలన్న ప్రతిపాదన తప్పనిసరి అయిపోయింది. ఇందుకు ముందుగానే థియేటర్ల వారీ లెటర్లు రెడీ చేయడం, కోర్టుల ద్వారా ఆదేశాలు తెచ్చుకోవడం...అలాగే ఏయే థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తామో ముందుగానే ఫిక్స్ చేసుకుంటే, హడావుడి లేకుండా సులభంగా అన్ని పనులైపోతాయి. 

ప్రభాస్ సాహో విషయంలో లాస్ట్ మినిట్ హడావుడి, లేనిపోని గొడవలు తప్పలేదు. కానీ సైరా విషయంలో అలా కాదు. పక్కాగా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు చిత్ర బృందం. అందుకే సినిమా విడుదలకు పదిరోజులు ఉండగానే ఆంధ్రలో టికెట్ రేటుపెంపు కోసం కావాల్సిన వ్యవహారాలు అన్నీ పూర్తిచేసారని తెలుస్తోంది. టికెట్ రేటు రెండువందలు గా  ఫిక్స్ అయిపోయింది. సైరా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల మేరకు బిజినెస్ చేసారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి. సాహో సినిమా 80 నుంచి 90 కోట్ల రేంజ్ లో వుండిపోయింది. మహేష్ బ్లాక్ బస్టర్ మహర్షిది కూడా దాదాపు 80 కోట్ల రేంజ్ మాత్రమే. మెగాస్టార్ ఆల్ రౌండర్ రికార్డు ఖైదీ నెంబర్ 150 కూడా తెలుగులో 80 కోట్ల రేంజ్ దగ్గరే ఆగింది.

ఇలాంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల దాకా వసూళ్లు రావాలంటే సైరా ఫిగర్లు ఖచ్చితంగా బాహుబలి 2ని మ్యాచ్ కావాల్సిందే. వైజాగ్ ను పక్కనపెడితే మిగిలిన ఏరియాల్లో బాహుబలి 2 రేంజ్ కలెక్షన్లు తెచ్చుకోవాల్సిందే. మెగాస్టార్ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మాసివ్ ఓపెనింగ్ కలెక్షన్లు, దసరా సీజన్, సెలవులు అన్నీకలిసి సైరాను టార్గెట్ రీచ్ అయ్యేలా చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అంతేకాదు చిత్ర యూనిట్ కూడా ఇదే ధీమాతో ఉన్నారు. మరి మెగాస్టార్ మ్యానియా ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: