సినీ నటుడు, డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ నేత, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ శని వారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తెలుగు సినీ రంగంలో మాములు నటుడిగా ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఎన్నో సినిమాల్లో చిన్నా చితక వేషాలతో అలరించి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘మాస్టారి కాపురం’ సినిమా శివప్రసాద్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అటు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఇక నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమాలో నన్ను కొట్లే అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యారు శివప్రసాద్. నటుడిగానే కాకుండా దర్శకుడిగా తెలుగులో ‘ఇల్లాలు’, రోజా హీరోయిన్‌గా పరిచయమైన ‘ప్రేమ తపస్సు’, ఆ తర్వాత ‘టోపీరాజా స్వీటి రోజా’ ‘కొక్కోరకో’ వంటి పలు సినిమాలను కూడా డైరెక్ట్ చేసాడు.  అంతే కాక తులసి, మస్కా, ద్రోణ, డేంజర్, ఖైదీ, జై చిరంజీవ, బాలు, బలాదూర్, సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాల్లో నటించి మెప్పు పొందారు శివప్రసాద్.ఖైదీ సినిమా నుంచే నిర్మాతగా మారి పలు సినిమాల నిర్మాణాల్లో భాగమయ్యారు నారమల్లి శివప్రసాద్‌. ఆయనకు ఒక భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


చిత్తూరు జిల్లాకు చెందిన నారమల్లి శివప్రసాద్..  2009లో చిత్తూరు పార్లమెంటు సీటు ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో అక్కడనుంచి తెలుగు దేశం తరుపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రెండో సారి ఎంపీగా గెలిచారు. 2019లో మాత్రం తన సమీప పత్యర్ధి వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప చేతిలో మూడోసారి మాత్రం ఎంపీగా ఓటమి పాలైయ్యారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలె తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.


గత కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు శివప్రసాద్. కొన్ని రోజులుగా దీనికి చికిత్స పొందుతున్నారు. అయితే క్రమంగా ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లుగా తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: