మెగా హీరోల్లో మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్న హీరో వరుణ్ తేజ్. 2014 సంవత్సరంలో ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా వరుణ్ కు నటుడిగా గుర్తింపు వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ నటించిన కంచె సినిమాకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు పెద్దగా రాలేదు. 
 
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. కానీ ఈ సినిమా క్రెడిట్ అంతా హీరోయిన్ సాయిపల్లవి ఖాతాలోకి వెళ్లిపోయింది. 
 
ఫిదా తరువాత వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ సినిమా కూడా హిట్ అయింది. అంతరిక్షం సినిమా ఫ్లాప్ అయినా మంచి ప్రయోగంగా పేరు తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరం సంక్రాంతికి వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈ సినిమాలో మేజర్ సక్సెస్ క్రెడిట్ వెంకటేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. వరుణ్ తేజ్ కెరీర్లో సోలో క్రెడిట్ తో బ్లాక్ బస్టర్ లేదనే విమర్శ ఉంది. 


నిన్న విడుదలైన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మొదటిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 67 లక్షల రూపాయలు షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొదటిరోజే 25 శాతానికి పైగా రికవరీ కావటంతో ఈ సినిమా నిర్మాతలకు భారీగా లాభాలను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం వరుణ్ తేజ్ క్రేజ్ తో వాల్మీకి బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో వరుణ్ ఖాతాలో సోలోగా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఈ సినిమా హిట్ తో వరుణ్ తేజ్ పై సోలోగా సక్సెస్ క్రెడిట్ లేదనే విమర్శ కూడా పోయినట్లే అని చెప్పవచ్చు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: