ఏ.ఆర్.మురగదాస్ పేరు చెప్తే అందరికి ముందు గుర్తొచ్చే సినిమాలు, రమణ, గజని, స్టాలిన్, తుపాకి..ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్న దర్బార్. ఈ సినిమా దాదాపు షూటింగ్ అంతా ముంబాయ్ లో జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన రజని లుక్ అటు తమిళంలో ఇటు తెలుగులో బాగా ఆకట్టుకుంది. అయితే గత కొన్ని నెలలుగా ఈ డైరెక్టర్ కి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. మొన్నటికి వరకు బన్నీతో సినిమా తీయడానికి మురుగదాస్ చర్చలు జరపబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నాడంటు ఫిల్మ్ నగర్ లో ఈ వార్త బాగా చక్కర్లు కొట్టింది. ఇప్పుడు బన్నీ స్థానంలో ఎన్టీఆర్ పేరు వచ్చి చేరింది.

త్వరలోనే ఎన్టీఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నాడట. గత రెండు రోజులనుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇప్పుడు జనాలందరు చెప్పుకుంటున్నారు. అయితే అసలు ఇందులో నిజమెంత? అటు బన్నీ లేదా ఇటు ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు మరో సినిమాకు ఓకే చేసే పొజిషన్ లో ఉన్నారా? అంటే సరైన సమాధానం లేదు.

తెలుగు-తమిళ భాషల్లో బన్నీ ఓ సినిమా చేయాలనుకుంటున్న మాట మాత్రం నిజమే. ఈ ప్రాజెక్ట్ కోసం మురుగదాస్ ను సంప్రదించిన మాట కూడా నిజం. కానీ వీళ్లిద్దరూ కలిసి చర్చలు జరిపారనే విషయంలో మాత్రం నిజం లేదు. ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న దర్బార్ సినిమా పనుల్లో మురుగదాస్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ తో ఒక సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈ కమిట్‌మెంట్ ప్రకారం చూస్తే మురుగదాస్ బన్నీతో సినిమా చేసే ఛాన్స్ ఏమాత్రం లేదు.

ఇక బన్నీ కూడా ఖాళీగా లేడు. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. తర్వాత సుకుమార్ సినిమా లైన్లో ఉంది. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలి. ఈ కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాతే బన్ని మరో సినిమా చేస్తాడు. ఇక ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం ఆర్-ఆర్-ఆర్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాల శివతో సినిమా కమిటయ్యాడు. దీన్ని బట్టి చూస్తుంటే మురుగదాస్ తో ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు చేయబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదు. దర్బార్ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: