మెగా హీరోల సినిమాలకు ఈ మధ్య కాలంలో సినిమా విడుదలకు ముందు కష్టాలు తప్పటం లేదు. వాల్మీకి సినిమా విడుదలకు ముందు ఈ సినిమా టైటిల్ మార్చాలని వాల్మీకి కులానికి చెందిన వారు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాల్మీకి టైటిల్ పై అభ్యంతరాల వలన సినిమా విడుదల అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆగిపోవటంతో చివరకు టైటిల్ ను గద్దలకొండ గణేష్ గా మార్చారు. 
 
సైరా నరసింహారెడ్డి సినిమా విషయంలో టైటిల్ సమస్యలు లేకపోయినా 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చిత్ర యూనిట్ మోసం చేశారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. సినిమా కథ కొరకు అన్ని ఆధారాలను తీసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పట్టించుకోవటం లేదని బాధితుల నుండి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ కేసుపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు అయిందని సమాచారం. 
 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన వారు రామ్ చరణ్ స్వయంగా నోటరీ తయారు చేయించి 22 మందితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. సినిమా షూటింగ్ కొరకు ఆస్తులు, స్థలాలు వాడుకున్నారని తెలిపారు. న్యాయం జరగకపోవటం వలనే పోలీసులను ఆశ్రయించామని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి 5వ తరానికి చెందిన లక్ష్మీ, దస్తగిరి రెడ్డి చెబుతున్నారు. 
 
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథ చెప్పినందుకు 2 కోట్ల రూపాయలు, చట్టపరంగా 23 మందికి 50 కోట్ల రూపాయలు ఇస్తామని అగ్రిమెంట్ తీసుకుని ఇప్పుడు మోసం చేశారని చెబుతున్నారు. మరోవైపు చిత్ర యూనిట్ మాత్రం 100 సంవత్సరాలు దాటిన తరువాత చరిత్రకు సంబంధించిన వ్యక్తుల కథకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి సైరా చిత్ర యూనిట్ పై నమోదైన ఈ కేసు నిలబడుతుందో లేదో చూడాలి.
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: