మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా.. నరసింహారెడ్డి సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 2న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే అన్ని భాషల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఉయ్యాలవాడ కుటుంబీకులు తమకు రాయల్టీ కింద 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

 


చరిత్రలో కనుమరుగైపోయిన తొలి స్వాతంత్ర సమరయోధుడి వీరగాధను తెరకెక్కించడం ఓ అద్భుతం. పైగా 250 కోట్ల పెట్టుబడి పెట్టి దేశమంతా ఉయ్యాలవాడ వీరుడిని ఇంత భారీగా పరిచయం చేస్తుంటే ఉయ్యాలవాడ కుటుంబీకులమంటూ, తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేయడం తగని పని. 50కోట్ల పరిహారం అనే మాట వింటేనే సగటు మనిషికి కూడా “మరీ ఇంత ఆశా..” అనుకోక మానరు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్.. ఇలా ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల వీర గాధలు సినిమాలుగా తెరకెక్కాయి. వీరి కుటుంబీకులు ఎవరూ ఇంతలా డిమాండ్ చేయలేదు. తమ వంశం, తమ పూర్వికుడి వీరగాధ దేశమంతా మారుమ్రోగుతుంటే ఆనంద పడాల్సింది పోయి ఇలా రచ్చ చేయడం ఆ మహనీయుడి పరువుని తీస్తున్నట్టే లెక్క. భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఓ తెలుగు వాడు.. అని గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని ఇలా రచ్చ చేయడం తగదు.

 


ప్రభుత్వాలు కూడా జీవించి ఉన్న స్వాతంత్ర్య సమరయోధులకు లేదా వారి డిపెండెంట్స్ కు కొన్ని రాయితీలు, అవకాశాలు కల్పిస్తుంది కానీ వారి కుటుంబీకులకు, వారసులకు కాదు. నిర్మాతతో చర్చించుకుని పరిస్థితులను చక్కదిద్దుకోవటంలో తప్పు లేదు కానీ.. తమకు పరిహారం ఇవ్వడం న్యాయం.. ఇవ్వకపోవడం నేరం అన్నట్టు వ్యవహరించడం ఉయ్యాలవాడ వంశీకులు ఆలోచించుకోవాల్సిన విషయం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: