మాస్ సినిమాల్లో తనదైన కామెడీని మిక్స్ చేసి సినిమాలు తీయడంలో దిట్ట అయిన వివి వినాయక్ గత కొన్ని రోజులుగా హిట్లు లేక అవస్థలు పడుతున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన "ఇంటిలిజెంట్" సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా వినాయక్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా చెప్పుకోవచ్చు. దర్శకుడిగా తన కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిన వినాయక్ ప్రస్తుతం ఏ సినిమాని ప్రకటించలేదు.


ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆది దగ్గరనుండి ఠాగూర్, అదుర్స్, ఖైదీ నంబర్ 150 వరకు అన్ని సూపర్ హిట్ సినిమాలే. ఖైదీ నంబర్ 150 సినిమా విజయం సాధించినప్పటికీ అది చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఘోర పరాజయం అయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా వివి వినాయక్ హీరోగా సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నాడని టాక్.


సినిమాలో హీరోగా కనిపించడాని జిమ్ కి వెళ్ళి కసరత్తులు కూడా చేశాడట. పాత్రకి తగ్గట్లుగానే బరువు తగ్గానని, స్టార్ హీరోగా ఎదిగిపోవాలనే ఆలోచన తనకు లేదని చెప్పాడు. అయితే ఈ సినిమాలో వివి వినాయక్ లుక్ ఎలా ఉండబోతుందో తెలిసిపోయింది. నిన్న జరిగిన "సైరా" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరైన వివి వినాయక్ తన న్యూ లుక్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గడ్డం పెంచి, గ్లాసెస్ తో అచ్చు హీరోలానే కనిపించాడు.


అయితే వినాయక్ హీరోగా నటించే సినిమాలో లుక్ ఇదేనంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వినాయక్ మాత్రం చాలా కొత్తగా కనిపించాడు. మాస్ సినిమాల దర్శకుడయిన వివి వినాయక్ హీరోగా ప్రేక్షకులని ఏ విధంగా అలరిస్తాడేమో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: