భారీ బడ్జెట్ సినిమాలకు టాలీవుడ్‌ ఇండస్ట్రీ కేరాఫ్‌ అడ్రస్ గా మారుతోంది. ఇటీవలే అలాంటి భారీ సినిమా 'సాహో'ను యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తితో చూసింది. ఆ సినిమా తెలుగుతో పాటు.. ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదలయిన సంగతి తెలిసిందే. అంతేకాదు సాహో సినిమాకు కలెక్షన్లు కూడా తెలుగు కన్నా హిందీలోనే ఎక్కువగా రావడం విశేషం! అలా 'సాహో' వంటి భారీ సినిమా తర్వాత ఇప్పుడు 'సైరా' అంటూ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది మెగాస్టార్ 151 వ సినిమా.  
భారీతనంలో కొత్త అధ్యాయం సృష్ఠిస్తోంది 'సైరా నరసింహారెడ్డి'. బడ్జెట్‌లో భారీ తనమేకాదు.. కథలోనూ భారీతనం ఉన్న విషయం ఈ పాటికే అర్థమైంది. భారత స్వతంత్ర తొలి యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వస్తోందని అందరికి తెలిసిన విషయమే.

సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే.. హింసాత్మక మార్గంలో బ్రిటీషు వారిపై తిరుగుబాటు జరిపిన వీరుడు ఉయ్యాలవాడ అన్న విషయం ఈ జనరేషన్ వాళ్ళకు తెలియకపోవచ్చుగాని నాటి తరానికి ఎంతో స్పష్ఠంగా తెలుసు. ఈ రేనాటి సూర్యుడి జీవిత కథను సినిమాగా తీయాలని చిరంజీవి చాలాకాలం కిందటే అనుకున్నారట. అయితే అది ఆయన రీఎంట్రీతో సాధ్యం అయింది. 'బాహుబలి' తర్వాత పెరిగిన తెలుగు సినిమా ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమా రూపొంది, అతి త్వరలోనే విడుదల కాబోతుంది.  చారిత్రక నేపథ్యమున్న చిత్రమే అయినా, వాస్తవ సంఘటనలు, పాత్రలకి కల్పన జోడించిన ప్రయత్నమే అయినా కానీ 'సైరా నరసింహారెడ్డి' పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కించారు. అలాగే కీలకపాత్రలు అన్నిటికీ తగిన ప్రాధాన్యత వుంటుందంటూ, వివిధ భాషలకి చెందిన నటీనటులని ఒకచోటికి చేర్చి ఇండియా అంతా ఏకమై యుద్ధం చేసిందనే భావన తీసుకురావడం మంచి కమర్షియల్‌ టచ్‌. బాహుబలి మాదిరిగా అద్భుతమైన నిర్మాణ విలువలు, యుద్ధ సన్నివేశాలకి తోడు హత్తుకునే ఎమోషన్స్‌ వుండడంతో సైరా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం అవుతుందని ధీమాగా ఉన్నారు ట్రేడ్ వర్గాలు.   

మెగాస్టార్‌ కెరీర్‌లోనే తొలిసారి రెండు వందల డెబ్బై కోట్ల ఖర్చుతో తీసిన సినిమా. బిజినెస్‌ రేంజ్‌ ఎంత అన్నది ఇప్పుడే ఎవరు ఒక అంచనాకి రాలేకపోవడం ఆసక్తికరం. 
తెలుగునాట సైరా సినిమా 60 నుంచి 65 కోట్ల రేషియోలో, నెల్లూరు లాంటి చిన్న ఏరియాలు 60 కోట్ల రేషియోలో, వైజాగ్‌ లాంటి పెద్ద ఏరియాలు 65 కోట్ల రేషియోలో విక్రయించారు. మొత్తంమీద కేవలం ఆంధ్ర ఏరియా నుంచి 65 కోట్లు రాబట్టారు. అలాగే సీడెడ్‌ నుంచి మరో 20కోట్లు, నైజాం నుంచి 30కోట్లు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 115 వరకు వచ్చాయని తాజా సమాచారం. మొత్తానికి థియేటర్‌ రైట్స్‌ ద్వారా 173కోట్లు ఇప్పటికే వచ్చాయని తెలుస్తోంది. బాలీవుడ్‌, అదర్‌ లాంగ్వేజెస్‌ అమౌంట్లు రావాలి. ఇదిలావుంటే నాన్‌ థియేటర్‌ హక్కులు కూడా తక్కువేమీ కాదు. కేవలం డిజిటల్‌ రైట్స్‌ మాత్రమే అన్ని లాంగ్వేజెస్‌ కలిపి వరల్డ్‌ వైడ్‌గా 50 కోట్లకు అమెజాన్‌ ప్రైమ్ విక్రయించారు. ఇక శాటిలైట్‌ హక్కుల నుంచి 100 కోట్లు వరకు వస్తాయని సైరా నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇది కనుక వర్కవుట్‌ అయితే, థియేటర్‌, నాన్‌ థియేటర్‌ రూపంలో మూడువందల కోట్ల వరకు వస్తాయి. మొత్తంమీద బిజినెస్‌ పరంగా సైరా మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: