సైరా సినిమాలో మెగా ఫ్యామిలీ హీరోలందరు భాగం అవుతున్నారన్న విషయం ఇప్పటికే అర్థమైంది. అందులో భాగంగానే ఈ సినిమాకి రెండుసార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపిస్తుందని మెగాస్టార్ చిరంజీవి సైరా ఈవెంట్ లో బయటపెట్టారు. సినిమా ప్రారంభంలో పవన్ వాయిస్ వుంటుందని ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే చివరిలో మళ్లీ ఆయన మాటలు వుంటాయని, దేశంకోసం నిరంతరం తపించే పవన్ కళ్యాణ్ చెబితేనే ఆ మాటలు జనాల్లోకి వెళ్తాయని భావించి, చెప్పించామని మెగాస్టార్ చెప్పారు. ఇక ఫ్యాన్స్ కి ఉన్న మరో అనుమాన్నాన్ని మెగాస్టార్ పటా పంచలు చేశారు. సైరా సినిమా యూత్ కు ఎక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేసినవారు కూడా ఉన్నారని, కానీ ఈ సినిమా ముమ్మాటికీ యూత్ సినిమా అని, పాటలు, ఫైట్లు వుంటేనే యూత్ ఫిల్మ్ కాదని, దేశం అంటే ఇష్టపడే యువతకు నచ్చే సినిమా కూడా యూత్ ఫిల్మ్ అంటారని చిరు అన్నారు.

అంతేకాదు సైరా సినిమాను ఎంత లాభం వస్తుందన్న లెక్కలు వేసుకుని తీయలేదని, ఓ మంచి సినిమాగా మిగిలిపోవాలని తపించి తీసామని, విదేశాల్లో తీసిన ఒక్క వార్ ఎపిసోడ్ కే 70కోట్లకు పైగా ఖర్చయిందని ఆయన చెప్పారు. ఎప్పటికైనా ఓ చరిత్రకెక్కిన వీరుడి పాత్ర పోషించాలని దశాబ్ద కాలంగా తపిస్తున్నానని, ఏ డైరక్టర్, ఏ నిర్మాత అలాంటి పాత్రను తన దగ్గరకు తీసుకురాలేదని ఆయన చెప్పారు. అలాంటి నేపథ్యంలో పరుచూరి బ్రదర్స్ దశాబ్దకాలం కిందట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకువచ్చారని, ఈ పాత్ర మీరు మాత్రమే చేయాలి అని చెప్పారని అన్నారు.

ఇక సైరాకి దర్శకత్వం చేయమని పరుచూరి బ్రదర్స్ కోరారని కూడా ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. సైరా నిర్మాణానికి ధైర్యాన్ని ఇచ్చింది దర్శకుడు రాజమౌళి అని, సరైన సినిమా ఎంత ఖర్చుపెట్టి తీసినా అంతకు అంతా వస్తుందని ఆయన తన బాహుబలి సినిమాతో రుజువుచేసి, భరోసా ఇచ్చారని, అందువల్ల సైరా నిర్మాణంలో ఎంత ఖర్చు అయినా తెగించి ముందుకు వెళ్లగలిగామని రాజమౌళి గురించి ప్రస్తావించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: