మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేయాలని తెలుగు సినిమాల్లో ఉన్న ఏ డైరక్టర్ అయినా కోరుకుంటాడు. అటువంటి అవకాశం చాలా మంది డైరక్టర్లకు ఇంకా అందని ద్రాక్షే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాడే సమర్ధుడు. దానిని సరిగ్గా ఉపయోగించుకుని ఈ రోజు వేనోళ్ల పొగిడించుకుంటున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. పద్నాలుగేళ్ల కెరీర్ లో హిట్స్, ఫ్లాపులు సమానంగా ఉన్న సురేందర్ రెడ్డి ‘సైరా..’ సినిమాను సరైన రీతిలో తెరకెక్కించి తన సమర్ధతను నిరూపించుకున్నాడు.

 


సురేందర్ రెడ్డికి వచ్చింది మామూలు అవకాశం కాదు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సబ్జెక్ట్. 170 ఏళ్లకు పైగా వెనక్కు తీసుకెళ్లే కథ. భారీ క్యాస్టింగ్, ఖర్చు.. అన్నింటినీ అధిగమించాలి. అన్నింటికంటే ముఖ్యం మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేయడం. అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలి. సురేందర్ రెడ్డి ఎంపికపై చాలామంది పెదవి విరిచారు కూడా. కానీ సురేందర్ రెడ్డి దేనికీ వెరవలేదు. తనను నమ్మి వందల కోట్లు పెట్టుబడి పెట్టిన రామ్ చరణ్ ను, సినిమా తీయగలడని నమ్మిన  చిరంజీవిని మెప్పించాడు. తన రాత, తీతలోని టాలెంట్ ఉపయోగించి అద్భుతమైన టేకింగ్ తో చిరంజీవిలోని నటనను బయటకు తీసుకొచ్చి శెభాష్ అనిపించుకున్నాడు. సినిమాలో ఉన్న భారీ క్యాస్టింగ్ ను భయం లేకుండా హ్యాండిల్ చేశాడు. సినిమాకు ఈరోజు వస్తున్న రెస్పాన్స్ ఇందుకు ఉదాహరణ. ప్రతి విభాగాం నుంచి మంచి ఔట్ పుట్ రప్పించుకున్నాడు. మరుగున పడిపోయిన ఒక యోధుడి వీరగాధను నేటి తరానికి, భవిష్యత్ తరాలకు చిరంజీవి రూపంలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు.

 


చరిత్రకు కొంత కాల్పనికతను జోడించాడు. కొద్దిగా మార్పులు చేశాడు అనేకంటే.. సినిమాగా కొంత స్వాతంత్య్రం తీసుకోవాల్సిన అంశాల్లో తీసుకుని వాటిని ప్రేక్షకులు మెచ్చేలా తీయగలిగాడా లేదా అనేదే ముఖ్యం. ఇందులో వంద శాతం సక్సెస్ అయ్యాడు సురేందర్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: