తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకులు ఉన్నారు. కానీ.. అదే ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పింది మాత్రం నిస్సందేహంగా రాజమౌళినే. ప్రపంచానికి భారతీయ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే అనుకునే వారందరికీ ‘తెలుగు సినిమా కూడా ఉంది’ అంటూ పరిచయం చేశాడు. తను దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్ సినిమాల కలెక్షన్లతో భారతదేశంలో ప్రకంపనలు సృష్టించి తెలుగు సినిమా గౌరవాన్ని నిలబెట్టాడు. అపజయమెరుగని దర్శకధీరుడు రాజమౌళి జన్మదినం నేడు. ఈ సందర్భంగా రాజమౌళి గురించి..

 


ఈటీవీలో ప్రసారమైన శాంతినివాసం సీరియల్ తో మొదటిసారిగా రాజమౌళి దర్శకుడయ్యాడు. తర్వాత  ఎన్టీఆర్ తో 2001లో స్టూడెంట్ నెం.1 సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆ సినిమాకు దర్శకత్వం వహించి హిట్ కొట్టాడు. 2003లో తీసిన సింహాద్రి ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ హిట్ చిత్రంగా నిలిచింది. నితిన్ తో సై, ప్రభాస్ తో చత్రపతి, రవితేజతో విక్రమార్కుడు, ఎన్టీఆర్ తో యమదొంగ.. ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడయ్యాడు. తర్వాత 2009లో రామ్ చరణ్ తో తీసిన మగధీర ఓ సంచలనం. ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల్నే మార్చేశాడు రాజమౌళి. సినిమాకు పెట్టిన ఖర్చుకు మూడింతల వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. మగధీరతో ఇండస్ట్రీలో టాప్ పొజీషన్ లో కూర్చున్న జక్కన్న అక్కడి నుంచి శిఖరాలకు చేరుకున్నాడు. సునీల్ తో మర్యాదరామన్న తీసి హిట్ అందుకున్నాడు. ఈగతో బాలీవుడ్ దృష్టినీ ఆకర్షించాడు. ఈ హిట్స్ తో రాజమౌళి అంటే.. స్టార్ హీరోతోనే కాదు ఒక ఈగను పెట్టి కూడా హిట్ కొట్టగలడు అని నిరూపించుకున్నాడు.

 


ఇక బాహుబలి సిరీస్ ఓ సంచలనం. ఈ సినిమాలతో రాజమౌళి పేరు భారతీయ సిని పరిశ్రమలో మోగిపోయింది. ఎంత ఖర్చుపెట్టినా తిరిగి రప్పించగల ధీరుడు అనిపించుకున్నాడు. ‘సినిమా అంటే భారీగా ఉండాలి. సినిమా చూసే ప్రేక్షకుడికి సినిమాలో భారీతనం కనిపించాలి. విలనిజం భారీగా ఉండాలి. భారీ ఖర్చు పెట్టకపోయినా తెరమీద కథ భారీగా ఉండాలి’ అని అంటూంటాడు రాజమౌళి. నటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో రాజమౌళి పర్ఫెక్షనిస్ట్. ఎక్కడ భావద్వేగ సన్నివేశం పండించాలో సరిగ్గా తెలిసిన దర్శకుడు కాబట్టే ఆయన సినిమా ఎత్తులకు వెళ్లిపోతుంది. పెద్ద హీరోతో సినిమా తీయాలనుకునే దర్శకుల స్థాయి నుంచి.. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని హీరోలు భావించే స్థితికి చేరుకున్నాడు. ఇటువంటి దర్శకుడు తెలుగు సినిమాకు లభించిన వరం. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. రాజమౌళి మరిన్ని భారీ విజయాల్ని సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: